కేసీఆర్ పాలనలో జీవనదిగా మారిన వరద కాలువ.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిపోయింది. ‘ఎస్సారెస్పీ పునర్జీవ పథకం’తో 122 కిలోమీటర్ల పొడవున జలధారగా మారినా.. మళ్లీ నిర్జీవంగా కనిపిస్తున్నది. దశాబ్దాలుగా నెర్రెలు బారిన భూములను బీఆర్ఎస్ హయాంలో సస్యశ్యామలం చేసినా.. ప్రస్తుతం ప్రభుత్వ పట్టింపులేమితో వెలవెలబోతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జలాలను ఎత్తిపోసుకునే అవకాశమున్నా.. సర్కారు చోద్యం చూస్తుండడంతో కాలువ వట్టిపోతున్నది. ఫలితంగా పరీవాహక మండలాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడం, వరదకాలువ వట్టిపోవడంతో వేలాది మంది రైతులు సాగునీటికోసం తండ్లాడాల్సి వస్తున్నది. కన్నెపల్లి పంప్హౌప్ నుంచి నీటిని ఎత్తిపోసి, ఎల్లంపల్లి బరాజ్ మీదుగా వరద కాలువకు, అక్కడి నుంచి లింక్‌కెనాల్ ద్వారా కాకతీయ కాలువకు ఇవ్వాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది. స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నది.
జగిత్యాల, జూలై 22 (నమస్తే తెలంగాణ)/మల్యాల: ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నెర్రెలు బారిన చెరువులతో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాలు స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో సగర్వంగా తలెత్తుకున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాలుగా పేరు పడ్డ ఈ మండలాల్లో ఒకప్పుడు సేద్యం చేయడం సంగతి అటుంచితే, తాగేందుకు సైతం నీళ్లు దొరకని పరిస్థితి ఉండేది. జనవరి నుంచే గుక్కెడు నీటికి గోస పడేది. 1991లో ప్రతిపాదించబడి, తదుపరి ఉమ్మడి రాష్ట్రంలో తవ్వించిన వరద కాలువ సైతం ఆ మండలాల ప్రజలకు ఎందుకూ పనికి రాలేదు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఆసరాగా చేసుకొని, వరద కాలువను వినియోగించుకొని, చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఈ మండలాలకు జలసిరిని కల్పించింది. భూములు బీడుపెట్టి, బతుకుదెరువు కోసం దేశాలు పట్టుకుపోయిన వేలాది కుటుంబాలు స్వగ్రామాలకు చేరుకొని సేద్యం మొదలు పెట్టి, పుట్ల కొద్ది ధాన్యరాశులను పండించారు. అయితే ఇదంతా మొన్నటి వరకు జరిగిన కథే. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పూర్వ పరిస్థితి కనిపిస్తున్నది.
నాన్‌కమాండ్ మండలాల్లో ప్రశ్నార్థకంగా సేద్యం
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీరు అట్ట్టడుగుకు చేరుకున్నది. 15 టీఎంసీలే ఉండడంతో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని త్తిపోసుకునేందుకు అవకాశం ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వరద కాలువ వట్టిపోయింది. 122 కిలోమీటర్ల పొడవునా వెలవెలబోతున్నది. దీంతో పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్‌పల్లితోపాటు గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాల్లో సాగు మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. పరీవాహక మండలాల పరిధిలో దాదాపు లక్ష ఎకరాలు సాగు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పూర్తి కాలేదంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం అవుతున్నది. కాలం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో ఎత్తిపోతలు ప్రారంభించాలంటూ నాలుగు రోజుల క్రితం మల్యాలలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సర్కారు తీరును ఎండగట్టారు.
వట్టిపోయిన పథకం
ఉత్తర తెలంగాణ వరదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటి లభ్యత తగ్గిపోవడం, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడడంతో అప్పటి సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017లో పనులు ప్రారంభించి, 2020 వరకు పూర్తి చేయించారు. 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరద కాలువపై మూడు పంప్‌హౌస్‌లు నిర్మించారు. రాంపూర్, రాజేశ్వర్రావుపేటతోపాటు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద పంప్‌హౌస్ నిర్మించారు. 2020 నుంచి ఎత్తిపోతలతో వరద కాలువ రిజర్వాయర్‌గా మారింది. జగిత్యాల జిల్లాలో నాన్ కమాండ్ ఏరియాలుగా పేరుపడిన కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి మండలాల దశను, దిశను పునర్జీవ పథకం మార్చివేసింది. వరద కాలువకు తూములు ఏర్పాటు చేసి వాటి గుండా వందలాది చెరువులను నింపుకునే అవకాశాన్ని కల్పించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలో 25 తూములు ఏర్పాటు చేసి కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, మెట్పల్లి మండలాల్లోని 32 చెరువులను ఏటా రెండుమూడుసార్లు నింపుతూ వచ్చారు. ఈ చెరువుల కింద దాదాపు 6 వేల ఎకరాల భూమి సాగు కావడంతోపాటు ప్రజల తాగు, ఇతర అవసరాలకు సైతం వినియోగించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. వరద కాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారిపోవడం, చెరువుల్లో నీరు ఉండడంతో భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోయాయి. 2019కి ముందు వరకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 15 మీటర్ల దిగువన ఉండే భూగర్భజలాలు 4, 5 మీటర్లపైకి ఎగిసివచ్చాయి. అయితే నేడు పరిస్థితులు మారిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వానలు జాడలేకుంఆ పోయాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లిచ్చే అవకాశం లేకపోవడంతో ఆయకట్టులో నాట్లు వేసుకోలేని దుస్థితి ఏర్పడింది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, ఎల్లంపల్లి ద్వారా ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని నిర్వహించేందుకు అవకాశం ఉన్నా రేవంత్ సర్కారు దాన్ని అటకెక్కించడంతో నాన్ ఆయకట్టు మండలాల్లోని గ్రామాల్లో మళ్లీ కరువు చాయలు అలుముకుంటున్నాయి.
అనుసంధాన కాలువలో కనిపించని నీటి పరుగులు
పునర్జీవ పథకం సక్సెస్ కావడంతో వరద కాలువ పూర్తి స్థాయి నదీ రూపాన్ని సంతరించుకున్నది. అయితే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువలోకి పంపించేందుకు రూ.30 కోట్ల వ్యయంతో లింక్ కెనాల్ నిర్మించారు. 3,006 క్యూసెక్కుల సామర్థ్యంతో వరద కాలువ 88.400 కిలోమీటర్ వద్ద లింక్ కెనాల్ మొదలు పెట్టి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా తవ్వి కాకతీయ ప్రధాన కాలువ 97.460 కిలోమీటర్ వద్ద కెనాల్‌ను కలిపారు. అయితే అవసరాన్ని బట్టి నీరు కాకతీయ కెనాల్‌కు లేదా ఎగువకు వెళ్లేలా రామడుగు మండలం ర్యాలపల్లి గ్రామ పరిధిలో వరద కాలువకు రెండు గేట్లను (స్లూయీజ్) ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎస్సారెస్పీపై పూర్తి భారం తగ్గి, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోని సాగుకు కాకతీయ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరందించవచ్చని అధికారులు భావించారు. కేసీఆర్ పాలనలో వరద కాలువ-కాకతీయ కాలువ మధ్య లింక్ కెనాల్ ఏర్పాటుతో కాకతీయ కాలువ ఆయకట్టు పరిధిలో ప్రయోజనం చేకూరింది. కానీ, ప్రస్తుతం ఎత్తిపోతలు లేకపోవడంతో రైతులకు నిరాశే మిగులుతున్నది. డీ-70 నుంచి డీ-94 నంబర్ వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు
వరద కాలువ పరీవాహక ప్రాంతంలోని మండలాల రైతులందరూ ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో ఎత్తిపోతలు మొదలుబెట్టి పంటలను కాపాడాలంటూ ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మల్యాల మండల కేంద్రంలో రైతులు అఖిలపక్షంగా ఏర్పడి నిరసన తెలుపుతూ, ఎత్తిపోతల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వ వైఖరిలో చలనం రాకపోవడంతో పరీవాహక మండలాల్లోని గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహించి, అఖిలపక్షంగా ఏర్పడి పోరాటం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
ఆరెకరాలు సాగు చేయలేదు
రామన్నపేటలో నాకు పదకొండెకరాల భూమి ఉన్నది. అందులో ఐదెకరాలు మాత్రమే సాగు చేసిన. మరో ఆరెకరాలకు నారు పోసినప్పటికీ ఇప్పటికీ దుక్కి దున్నలేదు. వరదకాలువలో ఎప్పుడూ సజీవంగా ఉండడంతో పొలం వేస్తానని ఆశ ఉండే. కానీ, వర్షాభావ పరిస్థితులతో కాలువ ఎండిపోయింది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత జలాలు సమృద్ధిగా ఉన్నా ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకపోవడంతోనే మాకు ఈ కరువు వచ్చింది. సాగు చేసిన భూములు సైతం ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
– కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, రైతు, రామన్నపేట (మల్యాల మండలం)
మూడెకరాలు సాగు చేయలేదు
మాది ముత్యంపేట. నాకు గ్రామ శివారులోని వరదకాలువకు రెండు మోటర్లను గతంలో ఏర్పాటు చేసుకుని కిలోమీటర్ పొడవు పైప్‌లైన్ వేసుకుని వరి సాగు చేసుకుంటున్నా. ఈ వానకాలం సీజన్లో నాకున్న ఆరెకరాల భూమిలో మూడెకరాలు మాత్రమే నాటేసిన. మరో మూడెకరాలకు నారు పోసి వరద కాలువ నీరు వస్తుందని వేచి చూస్తున్నా. ఇప్పటికే చాలా మంది రైతులు నార్లు పోసుకుని ఆశగా చూస్తున్నరు. కానీ ఈ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ఎత్తిపోసేలా లేదు. మా ఊరి వరద కాలువలో నీటిమట్టం పూర్తిగా అడుగంటి భూమి తేలింది. నాకు తెలిసి గడిచిన పదేండ్లలో ఏనాడూ వరదకాలువ ఎండిపోలే.
– సంత ప్రతాప్‌రెడ్డి, రైతు, ముత్యంపేట (మల్యాల మండలం)