రామన్నపేట, ఏప్రిల్ 04 : రామన్నపేట మండల, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య అన్నారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ ఏకమై రామన్నపేట నియోజకవర్గం సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. దానికోసం జిల్లా, రాష్ట్ర, దేశస్థాయి అధికారులను కలవడంతో పాటు, అనేక హోదాలలో ఉన్న, రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను, రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి రామన్నపేటకున్న భౌగోళిక పరిస్థితులను, రామన్నపేటకు ఉన్న గత చరిత్రను వివరించాలన్నారు. రామన్నపేట నియోజకవర్గం సాధనతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అందుకు రాజకీయాలకతీతంగా కలిసి ముందుకు సాగాలని కోరారు.