Pat Cummins : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు ఫుల్‌టైమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన స్వదేశమైన ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన త్వరలోనే తిరిగి వస్తారని ఎస్ఆర్హెచ్ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన టీ20 వరల్డ్ కప్ సహా అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.
ఇప్పుడు ఐపీఎల్లో కూడా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచుల్లో ఆడలేదు. అతడికి సమస్య ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ఎస్ఆర్హెచ్ జట్టుతోనే ఉన్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే, తాజాగా అతడు ఆస్ట్రేలియా తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనల మేరకు కమిన్స్ ఆ దేశం తిరిగి వెళ్లాడు. అతడు ఏ టోర్నీలో ఆడాలన్నా సీఏ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. దీనికోసం అక్కడ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఈ నేపథ్యంలో వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆస్ట్రేలియా వెళ్లిన కమిన్స్ అక్కడ సీఏ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేయించుకుంటారు. కమిన్స్ పూర్తిగా కోలుకున్నట్లు భావిస్తే ఐపీఎల్లో ఆడేందుకు సీఏ అనుమతిస్తుంది. ప్రస్తుతం కమిన్స్ కోలుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ పరీక్షల అనంతరం సీఏ అనుమతితో ఐపీఎల్లో ఆడుతాడు.
ఏప్రిల్ 17న కమిన్స్ తిరిగి ఎస్ఆర్హెచ్ జట్టుతో చేరుతాడు. ఆ తర్వాత జరిగే మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీఏ అనుమతి లేకుండా, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతర టోర్నీల్లో ఆడితే అతడిపై సొంత జట్టైన సీఏ చర్యలు తీసుకుంటుంది. అందుకోసమే అక్కడికి వెళ్లి తగిన అనుమతులతో కమిన్స్ ఐపీఎల్లో అడుగుపెడతాడు. ఎస్ఆర్హెచ్.. తాజా ఐపీఎల్లో రెండు మ్యాచులు ఆడింది. ఒక దానిలో విజయం సాధించింది. మిగతా మూడు మ్యాచులకు కమిన్స్ దూరంగా ఉంటాడు. ఆ తర్వాతి మ్యాచులకు అందుబాటులోకి వస్తాడు.