నల్గొండ రూరల్, ఏప్రిల్ 04 : నల్లగొండ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనుల్లో తీవ్ర అవినీతి జరుగుతోందని, నాణ్యత లేని మట్టితో రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుపై ఆయన వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల స్వార్థం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి వాడాల్సిన నాణ్యమైన మెటీరియల్‌కు బదులుగా, కేవలం మట్టితోనే నింపేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, నాణ్యత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చే కోట్ల రూపాయలను ఇలా నాసిరకం పనులతో వృథా చేయడాన్ని సహించేది లేదని హెచ్చరించారు.