మంగళగిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఆయనలో సైకో లక్షణాలు ఇంకా పోలేదని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగామారి ఆయన నిత్యం విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచమంతా అమరావతిని ఏకైక రాజధానిగా స్వాగతిస్తున్నాయని, పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, అయినా జగన్, ఆయన ముఠా మాత్రం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని అంశంపై సాక్షి మీడియాలో జగన్ రెడ్డే ప్రశ్నలు వేసుకొని, ఆయనే సమాధానాలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఐదేళ్లు నరకం చూపించారని విమర్శించారు. ఇప్పుడు ప్రజా రాజధానికి దేశమంతా మద్దతిస్తుంటే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పారిపోయారని అన్నారు. దీన్నిబట్టే రాష్ట్రాభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నదని మండిపడ్డారు. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు.
సీమకు నీళ్లిస్తే బంగారం పండిస్తారన్న సిద్ధాంతంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తుంటే.. జగన్ మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరితే జగన్ పారిపోతున్నారని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమ ప్రాజెక్టులకు ఖర్చుచేయని వ్యక్తి, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.8,000 కోట్లతో రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుందని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. 738 కి.మీ. దూరంలో ఉన్న కుప్పానికి రూ.3,870 కోట్లతో హంద్రీనీవా నీటిని అందించిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించామని, అవుకు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించామని తెలిపారు. పులివెందులకు నీళ్లు తెచ్చిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని అన్నారు.
జగన్ పాలనలో ఇసుక దోపిడీ, నిర్వహణ లోపంవల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 39 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. జీవో 365 ద్వారా 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ రద్దుచేశారని, డ్యాముల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాయలసీమకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రభుత్వ వేధింపులవల్లే అల్ట్రాటెక్ వంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, ఇప్పుడు తాము ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్పారు.
కర్నూలు విమానాశ్రయం కట్టింది, ఓర్వకల్లును అభివృద్ధి చేసింది టీడీపీ అని, అయితే వీటితో ఏ సంబంధం లేని తన తండ్రి విగ్రహాలను జగన్ అక్కడ పెట్టుకోవడం ఆయన నైజమని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని ఆ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారని, 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదని మండిపడ్డారు.