కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ సర్కారు చేతగాని పాలనలో నేరాలు విజృంభిస్తున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలు క్షీణిస్తూ ఉంటే, మరోవైపు అభివృద్ధి అడుగంటుతున్నది. తాజాగా పోలీసు అధికారులు వెల్లడించిన గణాంకాలే అందుకు నిదర్శనం. రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్ల లెక్కలను పరిశీలిస్తే పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందని తెలుస్తున్నది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలోనే నేరాలు 41 శాతం పెరిగాయి. దొంగతనాలు 66 శాతం పెరిగాయి. పరిష్కారమైన కేసుల సంఖ్య 67 నుంచి 59 శాతానికి పడిపోయింది. రాచకొండలో నేరాలు 4 శాతం పెరిగాయి. హత్యలు, సైబర్ నేరాలు, లైంగికదాడుల కేసుల్లో అధిక పెరుగుదల ఉండటం గమనార్హం. ఇక సైబరాబాద్‌లో అయితే నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 64 శాతం పెరిగింది. ఈ పరిస్థితిని పోలీసు యంత్రాంగం ఏవేవో సాకులు చూపి సమర్థించుకోవాలని చూస్తుండటం విడ్డూరం. ఎఫ్ఐఆర్ల నమోదు సులభతరం చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందని ఒకరంటే, ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల సిబ్బందిని గ్రేటర్‌కు తరలించడం వల్ల నిర్వహణాపరమైన సమస్యలు ఎదురయ్యాయని ఒకరంటున్నారు.
నేరపూరిత వాతావరణంలో సంపద సృష్టి సాధ్యపడదు. అభివృద్ధికి శాంతి భద్రతల అండదండలు తప్పనిసరి. అందుకే తెలంగాణ సాధకుడు కేసీఆర్ తొలుత నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం వినూత్న పథకాలు చేపట్టారు. హాక్ ఐ, షీ టీమ్స్ వంటి చొరవలతో ప్రశంసలు అందుకున్నారు. ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలు మొదలుకుని అధునాతన వాహనాల దాకా అన్నింటినీ సమకూర్చారు. కేంద్రీకృత నిఘా వ్యవస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. నూతన కమిషనరేట్లను ఏర్పాటు చేసి పర్యవేక్షణను విస్తరించారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నేర నిరోధక వ్యవస్థను బలోపేతం చేశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022లో తెలంగాణ పోలీసు అగ్రస్థానంలో నిలవడం ఈ కృషికి గుర్తింపుగా భావించాలి. బంగారు తెలంగాణకు ఇవన్నీ రక్షణ కవచాలయ్యాయి. కానీ, ఏడాదిలో అంతా తారుమారైంది.
ప్రశాంత తెలంగాణ భయాందోళనల తెలంగాణగా మారిపోయిందన్నది వాస్తవం. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో క్రమంగా రాష్ట్రం పోలీసు వలయంగా మారుతుండటాన్ని మనం చూస్తున్నాం. సామాన్యులను కేసులతో వేధించడం, సంకెళ్లు వేసి రైతులను నడిపించడం వంటి ఘోరాలు నిత్యకృత్యమైపోతున్నాయి. పైన తెలిపిన నేరాల వెనుక ప్రభుత్వ పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుని ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే, శాంతిభద్రతలతో పాటు మొత్తంగా హోంశాఖ ఆయన దగ్గరే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆయన పరిపాలనా ప్రావీణ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయనేది కాదనలేని వాస్తవం. ఇప్పటికైనా పూర్తిస్థాయి హోంమంత్రిని నియమించి దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుంటుంది.