Jeevan Reddy | రాయికల్, జూన్ 06 : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ప్రజల నుంచి అభిప్రాయా లను క్రోడీకరించి భూసమస్యల శాశ్వత పరిష్కరానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని అన్నారు. గత ప్రభుత్వం 2017 డిసెంబరులో రెవెన్యూ అధికారుల ఇష్టానుసారంగా ధరణి పేరుతో భూ రికార్డుల ప్రక్షాళన చేసి రైతులకు శాపంగా మారి రెవెన్యూ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని ఆరోపించారు.
నూతన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలను ఫిర్యాదు రూపంలో తీసుకొని పరిష్కార మార్గం చూపుతున్నట్లు తెలిపారు. ఇరు వర్గాల మధ్య వివాదాలకు తోడు, ఒకే సర్వేనెంబర్ ఉండి పట్టా, ప్రభుత్వ భూమిగా మారితే, సాగు భూములు రైతులకు పట్టా కాకపోవడం వంటి రైతుల భూ సమస్యల ఫిర్యాదును తహసీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఇలా దశలవారీగా సమస్యలకు నూతన భూభారతి చట్టం పరిష్కార మార్గం చూపుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అండగా ఉండి న్యాయవాదిగా తాను న్యాయ సలహాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 12 సంవత్సరాల పైబడి నిరంతరం సాగులో ఉన్న రైతులకు పట్టా చేసుకునే అవకాశం గత ధరణిలో లేని నూతన చట్టం (సీపీసీ) కల్పించిందని అన్నారు.
గతంలో రేషన్ కార్డు కలగా మిగిలింది
గతంలో రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డు కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ రేషన్ కార్డు వెంట సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు 600 స్క్వేర్ ఫీట్స్ లోపు ఇల్లు కట్టుకునేందుకు రూ.ఐదు లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ కల్పనతో పాటు యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాజీవ్ యువ వికాస్ పథకంలో మొదట విడతగా రూ.50 వేలు, లక్ష రూపాయల లోన్ల లబ్ధిదారులకు ఎంపిక చేసి పథకం అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, నాయకులు కొయ్యేడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, ఎద్దండి దివాకర్, షాకీర్, పొన్నం శ్రీకాంత్, తలారి రాజేష్, కడకుంట్ల నరేష్, కొత్త పెళ్లి గోపాల్, రవీందర్, జగదీష్, బాపురపు రాజీవ్, అశోక్, రాజేష్, సంతోష్, నరసింహారెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.