దీపావళి పండుగకు ఊరికి వచ్చి.. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బయల్దేరినవాళ్లు కొందరు. కోటి ఆశలతో జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నవాళ్లు ఇంకొందరు. ఆత్మీయులను కలిసేందుకు ప్రయాణమైనవాళ్లు మరికొందరు. తెల్లవారేసరికి గమ్యస్థానం చేరుకుంటామని భావించిన వారి జీవితాలు తెల్లారిపోయాయి. బస్సు ప్రయాణం బతుకుల్ని బుగ్గి చేసింది. మగత నిద్ర నుంచి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఊపిరాడక కొందరు, తప్పించుకునే మార్గం లేక మరికొందరు, మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరులో వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో హృదయవిదారక దృశ్యాలివి. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 20 మంది సజీవదహనం కాగా, మరో 21 మంది గాయపడ్డారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus)కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణిస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 9:30 గంటలకు వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (డీడీ 01 ఎన్ 9490) హైదరాబాద్ శివారు పటాన్చెరు ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటలకు కర్నూలు జిల్లా చిన్నటేకూరు ఉల్లిందకొండ మలుపు వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే చనిపోగా, బైక్ బస్సు కిందకు చొచ్చుకెళ్లింది. అయినా బస్సు డ్రైవర్ ఆగలేదు. బైక్‌ను 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయింది. రాపిడితో మంటలు వ్యాపించాయి.
ప్రమాదం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయకుండానే ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ పారిపోయారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని, కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. మెయిన్ డోర్ క్లోజ్ అయి ఉండటం, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో కొంత మంది అద్దాలు పగులగొట్టి కిందకు దూకారు. గాఢనిద్రలో ఉన్నవాళ్లు తేరుకోనేలోపే బస్సుకు మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో వారు సజీవ దహనమయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులే ఉన్నారు. ప్రమాదం, సహాయ చర్యల కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. బాధితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా 9502271122, 8712661828, 9100901599, 9100901598 నంబర్స్‌కు కాల్ చేయాలని సూచించారు.
ప్రమాదం జరిగిన సమయంలో భారీవర్షం కురుస్తున్నట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. బస్సుకు మంటలు అంటుకోగానే డ్రైవర్ గమనించాడు. మరో డ్రైవర్‌ను నిద్రలేపాడని, డ్రైవర్ సీటు వద్ద ఉన్న వాటర్ బబుల్స్లోని నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నంచేసినా మంటలు అదుపులోకి రాలేదని చెప్పారు. బస్సు ప్రమాదం గురించి డ్రైవర్ కనీసం ఎవరినీ అలర్ట్ చేయలేదని, అలర్ట్ చేసి ఉంటే ప్రయాణికులు బతికి ఉండేవారని తెలిపారు. మంటలు గమనించి తాము లేచినా ఎమర్జెన్సీ డోర్స్ తెరుచుకోలేదని అద్దాలు బ్రేక్ చేసి బయటకు దూకామని వెల్లడించారు. బస్సులో ఏం జరుగుతున్నదో తమకు అర్థం కాలేదని, ఊపిరి ఆడలేదని, బస్సును పొగ కమ్మేసిందని చెప్పారు. ప్రమాద స్థలంలో పరిస్థితులు హృదయ విధారకంగా ఉన్నాయని చెప్పారు. మాంసపు ముద్దలు, అస్తిపంజరాలను చూసి తట్టుకోలేకపోయామని… తీవ్ర ఆవేదనతో వివరించారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఘోర బస్సు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైక్‌ను బస్సు ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే.. ఇంత పెద్ద ఘోరం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. మంటలు అంటుకోగానే బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకినట్టు గాయపడిన ఓ ప్రయాణికుడు తెలిపాడు. ప్రయాణికులు ఏమైపోతే మాకేంటీ? అనే ధోరణిలో డ్రైవర్లు పరుగులు తీశారని చెప్పాడు. ప్రయాణికులను కనీసం అప్రమత్తం చేయలేదని, అలా చేసి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడే వారని ప్రమాదం నుంచి బయటపడ్డ మరో ప్రయాణికుడు తెలిపాడు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తున్నది.
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రమాద ఘటన విచారకమని, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల సజీవ దహనంపై ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 20 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ప్రమాదం పట్ల బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలువాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. బస్సు ప్రమాదం తీవ్ర విచారకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాద ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి కలిగిందని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసుదనాచారి తెలిపారు. గాయపడ్డ వారికి ట్రావెల్స్ యాజమాన్యమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
1) జే ఫిలోమిన్ బేబీ (64), 2)కిశోర్ (64), 3)ప్రశాంత్ (32), 4)ఆర్గా బందోపధ్యాయ(23), 5) యువన్ శంకర్ రాజా(22), 6)మేఘనాథ్(25), 7)ధాత్రి (27), 8)అమృత్‌కుమార్(18), 9)చందనమంగ(23), 10)అనూష(22), 11)గిరిరావు(48), 12) కేనుగు దీపక్‌కుమార్(24), 13) జీ రమేశ్, 14)జీ.అనూష, 15)మనిత, 16)కేశనాథ్, 17) సంధ్యారాణి18) కర్రీ శ్రీనివాసరెడ్డి 19)పంచాల శివశంకర్(ద్విచక్రవాహనదారుడు), బస్సులో ప్రయాణిస్తూ సజీవ దహనమైన మరో వ్యక్తి ఎవరో తేలాల్సి ఉంది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద మృతు ల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు తక్షణ సా యం అందించనున్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. తెలంగాణకు చెందిన మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైవేపై ప్రమాద ధాటికి నామరూపాలు లేకుండా పోయిన ట్రావెల్స్ బస్సు

ఘటనాస్థలంలో ప్రమాదానికి గురైన బస్సు వెనక భాగాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ప్రమాదస్థలి వద్ద బస్సు కింద ఉన్న బైక్ విడిభాగాలను సేకరిస్తున్న సిబ్బంది. (ఇన్సెట్లో) బస్సు కింద చిక్కుకుపోయిన బైక్ పెట్రోల్ ట్యాంక్

ప్రమాదం జరిగిన బస్సులో సజీవదహనమైన ప్రయాణికుడి మాంసపు ముద్దను కిందికి తీసుకొస్తున్న ఫోరెన్సిక్ సిబ్బంది