భీమదేవరపల్లి/హుజూరాబాద్, అక్టోబర్ 24 : గురుకులంలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌లో ఆందోళనకు దిగారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఇందుకు బాధ్యత వహించిన సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన మమత, తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత (15) వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీ వర్షిత ఈ నెల 23న తిరిగి పాఠశాలకు వచ్చింది.
శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది సెల్‌ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇకడ ఉండలేనని మొరపెట్టుకున్నది. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నట్టు బదులిచ్చారు. ప్రార్థనా సమయం కావడంతో విద్యార్థులంతా బయటకు రాగా, శ్రీవర్షిత కనిపించలేదు. దీంతో డార్మెటరీ హాల్‌కు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకొని విగత జీవిలా కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సర్కార్‌దే బాధ్యత: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
విద్యార్థిని శ్రీవర్షితది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శ్రీవర్షిత మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఏరియా దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించగా, ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని విద్యార్థిని తల్లిదండ్రులను ఓదార్చారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం వర్షిత మృతదేహంతో ఏరియా దవాఖాన నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక విద్యార్థిని మరణించిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన ఆధీనంలో పెట్టుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ అసమర్థ పాలనతోనే విద్యార్థులు ఇబ్బందులు ఎదురొంటున్నారని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, శ్రీవర్షిత ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు.