అతి అనర్థమని విన్నదే. ఇది అన్నింటిలోనూ నిజమే. ‘ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు బాగా తినండి’ అనే మాట ఎక్కువగా వింటున్నాం. పండ్లు ప్రకృతి ఇచ్చిన తియ్యని క్యాండీలు. కాకపోతే ఇందులో చక్కెరే కాదు విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్నాయని రోజులో రెండు మూడు యాపిల్స్, నాలుగైదు అరటిపండ్లు, అర లీటరు నారిజ రసం ఇలా రకరకాల పండ్లు, పండ్ల రసాలు లాగేస్తే ప్రమాదమే! ఇలా చేస్తే మేలుకు బదులు కీడు జరుగుతుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా పండ్లు తినడం వల్ల అజీర్తి కలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోయి లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి.
పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటి ఆక్సిండెట్లు హాని కలిగించవు. కానీ, వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో సమతుల్యత దెబ్బతింటుంది. దానివల్ల వ్యాధుల బారినపడతారు. డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్లు, హార్మోన్ల సమస్యతో బాధపడే ఆడవాళ్లు.. పండ్లు మితంగా తీసుకోవడం చాలా అవసరం.
పండ్లలో ఫ్రక్టోజ్ (సహజ చక్కెర) అధికంగా ఉంటుంది. ఇది దేహంలో ట్రైగ్లిసరైడ్స్ని పెంచుతుంది. శరీరం ఉపయోగించుకోని చక్కెర (ఫ్రక్టోజ్) కాలేయంలో చేరిపోతుంది. అందువల్ల ఫ్యాటీ లీవర్ సమస్య వస్తుంది. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ పండ్లు తినాలి. కానీ, ఒకే రకమైన పండ్లు తీసుకోవడం సరికాదు. అలాగే, పరిమాణంలో భోజనానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి. అనేక రకాలైన పండ్లు ఎంచుకొని, పరిమితంగా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.