గజ్వేల్, అక్టోబర్ 24: పాఠశాల ఆవరణలోని బోరుమోటర్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి గాయపడ్డాడు. ఈ క్రమంలో స్పృహకోల్పోవడంతో ఓ ఉపాధ్యాయుడు వెంటనే సీపీఆర్ చేయగా కదలిక రావడంతో దవాఖానకు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. కోమటిబండలోని ప్రాథమిక పాఠశాలలో అదే గ్రామానికి చెందిన మాన్విత్ ఐదోతరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్నం ఉపాధ్యాయులు బోరు మోటర్ ఆన్ చేయాలని మాన్విత్కు చెప్పడంతో అతను మోటర్ ఆన్చేసే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి కిందపడి పోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన ఉపాధ్యాయుడు దామోదర్ విద్యార్థికి సీపీఆర్ చేశాడు. విద్యార్థిలో కదలిక రావడంతో వెంటనే చికిత్స కోసం గజ్వేల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బోరు మోటర్ వేయాలని పురమాయించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.