పిల్లల ఆరోగ్యానికి బీట్రూట్ ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న వారి శరీరాలకు అనువైన పోషకాలను అందిస్తుందని అంటున్నారు. ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియంతోపాటు మరిన్ని విటమిన్లతో నిండిన బీట్రూట్.. ఎన్నోరకాల ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొంటున్నారు.
నేటితరం పిల్లల్లో ఐరన్ లోపం, రక్తహీనత ఎక్కువగా కనిపిస్తున్నది. బీట్రూట్లోని నాన్-హీమ్ ఐరన్, ఫోలేట్ (విటమిన్ బి9).. ఆరోగ్యకరమైన ఎర్రరక్త కణాల తయారీకి, పెరుగుదలకు తోడ్పడుతాయి. బీట్రూట్లోని నైట్రేట్లు.. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇది రక్త నాళాలు విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సాయపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
బీట్రూట్లో బీటా లైన్స్ లాంటి యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతోపాటు శరీర కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. పెరుగుతున్న పిల్లల రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఇప్పటితరం పిల్లలు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటివారికి తక్కువ కేలరీలు, అధిక పోషకాలతో నిండిన బీట్రూట్ను తినిపించడం వల్ల.. ఆహార సమతుల్యత ఏర్పడుతుంది.
శరీరంలో అదనపు కొవ్వులు, చక్కెరలను నివారించడంతోపాటు సూక్ష్మ పోషకాలను అందించడంలోనూ సాయపడుతుంది. ఇక ఫైబర్‌తో నిండిన బీట్రూట్.. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడంతోపాటు పెద్దపేగు ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. మొత్తానికి పిల్లల ఆహారంలో బీట్రూట్ను చేర్చడం ద్వారా వారి పెరుగుదల, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, మెదడు, రక్త నాళాల ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది.