నర్సాపూర్, అక్టోబర్ 24 : గురుకులంలో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. కాగా మరికొందరు స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ సమీపంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికల)లో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. గురుకుల పాఠశాలలో వసతి గృహం గురువారం రాత్రి భోజనం తరువాత విద్యార్థినులంతా నిద్రపోయారు. శుక్రవారం ఉదయం లేచిన తరువాత ఎనిమిది మందికి ఎలుకలు కరిచిన గాయాలు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరికి చర్మ సంబంధిత సమస్యలు వచ్చాయి. హాస్టల్ సిబ్బంది వీరిని నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు.
ఎలుకలు నన్ను కూడా వదలడం లేదు..
హాస్టల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉన్నదని పాఠశాల ప్రిన్సిపాల్ లలితాదేవిని తెలిపారు. రాత్రి సమయంలో తనపై నుంచి కూడా ఎలుకలు పాకుతున్నాయని పేర్కొన్నారు. ఎలుకలే కాకుండా కోతులు కూడా విద్యార్థినులను గీరాయని తెలిపారు. ఎలుకలు కరిచిన విద్యార్థినులను ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స చేయించినట్టు చెప్పారు. హాస్టల్లో 540 మంది ఉండగా, వారికి సరిపడా వసతులు లేవని తెలిపారు. నిద్రించడానికి స్థలం కూడా లేదని చెప్పుకొచ్చారు. హాస్టల్ పొలాల మధ్య, అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం పాఠశాల ఆవరణలోకి మూడు పాములు వచ్చినట్టు చెప్పారు. హాస్టల్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.