Priest Rangarajan | రాముడి పేరుతో దౌర్జన్యం చేస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రంగరాజన్‌ను కూనంనేని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రాముడి పేరు చెప్పుకుని నిజమైన రామ భక్తులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. భారత దేశం వివిధ మతాలకు నిలయమని, రాముడి పేరుతో రాజకీయాలు చేయడం దౌర్జన్యాలకు తిగడం ముమ్మాడికి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాముడు అందరివాడని.. కొందరు రాముడిని కొందరికే పరిమితం చేసి ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నిజమైన రామ భక్తులు ఇతరుల మీద దాడులు చేయరని, రాముడి ఆలోచనలకు విరుద్ధంగా వెళ్లరన్నారు. రామరాజ్యం అంటే దౌర్జాన్యాలు కాదని శాంతిని నెలకోల్పో విధంగా రామ భక్తులు నడుచుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్‌పై దాడి చేసిన వ్యక్తులను ఎవరిని వదలకుండ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోలు రవీంద్రచారి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగుంట పర్వతాలు,రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం, మండల కార్యదర్శి కే శ్రీనివాస్, శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, చేవెళ్ల కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, నర్సింహ్మరెడ్డి, సుధాకర్‌గౌడ్, అంజయ్య, వెంకటయ్య, మల్లేశ్, రఘురాం, నారాయణ, మధు, పాల్గొన్నారు.