హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ): నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర విసృ్తత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్త కార్యాచరణను పార్టీ ప్రకటించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఈనెల 27న హైదరాబాద్‌లోని లోక్‌భవన్, జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు పాద యాత్రలు, ప్రచార యాత్రలు, సెప్టెంబరు 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సెప్టెంబరు 17 భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.