హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. ఎన్డీయే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో 2022 లోగా నెరవేరుస్తామని మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేయదలుచుకొన్నా. బడ్జెట్లో అన్ని రాష్ర్టాలకు సమాన కేటాయింపులు ఉంటాయని, వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో సహకారం అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగవది అని, ఇలాంటి ప్రగతిశీల రాష్ర్టాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని, నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని విన్నవించారు.