హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ (Congress) పతనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడ్డారని, రెండేండ్లలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఫలితాల ద్వారా బట్టబయలైందని, రాష్ట్రంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో 40 నుంచి 70 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలువడమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. ‘ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇన్ని స్థానాలు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. రెండేండ్లలో ఏదో గొప్పగా సాధించామని చెప్పుకొంటూ స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాలు తిరుగుతూ పరోక్షంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుచేటు. సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ప్రచారం చరిత్రలో ఎన్నడూ చూడలేదు’ అని ఎద్దేవాచేశారు.
ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అభిమానం, కేసీఆర్‌పై ఉన్న ప్రేమను చూసి ఓర్వలేక కాంగ్రెస్ కిరాతకానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాల చేతిలో సూర్యాపేట జిల్లాకు చెందిన కార్యకర్త ఉప్పల మల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడని, నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని, చిట్యాల మండలంలో పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడన్న ఉద్దేశంతో ఓట్లు గల్లంతు చేసి దాష్టీకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. వేములవాడ మండలం చింతలఠాణాలో సర్పంచ్‌గా నామినేషన్‌వేసి గుండెపోటుతో మృతి చెందిన మురళి, సిరిసిల్లలో సీనియర్ జర్నలిస్ట్ దాసరి దేవేందర్ కుటుంబాలను పరామర్శించారు. తెలంగాణ భవన్లో పార్టీ మద్దతు సర్పంచ్‌లను సన్మానించి, విధులపై దిశానిర్దేశం చేశారు. పదవులను కాపాడుకుంటూ పార్టీ, ఊరికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు బెదరకుండా ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన నేతల వెన్నంటి నిలిచారని చెప్పారు.
రెండేండ్ల రేవంత్ సర్కారు పాలనా వైఫల్యాలకు తోడు..ఆరు గ్యారెంటీల పేరిట చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ఊర్లల్లో ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేస్తున్నయి. పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే అధికార కాంగ్రెస్ దుస్థితి ఇలా ఉంటే.. ఇక పార్టీ గుర్తుపై జరిగే పరిషత్ ఎన్నికల్లో ఇంకా ఘోర పరాభవం తప్పదు.
-కేటీఆర్
బీఆర్ఎస్ మద్దతు సర్పంచులను కాంగ్రెస్ బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సస్పెండ్ చేస్తామని ఎవరైనా అధికారులు, పాలకపక్ష నేతలు బెదిరిస్తే ఒక క్షణం కూడా ఆలోచించకుండా పార్టీని సంప్రదించాలని సూచించారు. లీగల్ సెల్, పార్టీ యంత్రాంగం అరగంటలో సహాయ సహకారాలందిస్తాయని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులను సాధించే బాధ్యతను తాము తీసుకుంటామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తర్వాత సర్పంచ్‌లే రాజులని, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరించినా భయపడవద్దని సూచించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి విడిపించే పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికిరెప్పలా కాపాడుకుంటది. కష్టకాలంలో గులాబీ పార్టీ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా బంగారు బాటలు వేస్తం. అధికార పక్షానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, గెలుపులో భాగస్వాములైన పార్టీ కార్యకర్తలకు మరోసారి అభినందలు.
-కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచిందని, ఇంకా పనిచేసేది రెండున్నరేండ్లేనని కేటీఆర్ తెలిపారు. తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. సర్పంచ్‌లు పదవులను అలంకారప్రాయంగా కాకుండా గ్రామాభివృద్ధి సాధనంగా వాడుకోవాలని, సూర్యాపేట జిల్లాలోని ఏపూర్ గ్రామ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చెక్‌డ్యామ్‌లు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు అందుకున్నదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని గుర్తుచేశారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానాన్ని సాధించిందని గుర్తుచేశారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకున్నదని, ఇది కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని పేరొన్నారు. రికార్డును దేశంలోని ఏరాష్ట్రం సాధించలేదని తెలిపారు.
అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్న సీఎం రేవంత్‌కు పల్లె జనులు ఓటుతో గుణపాఠం చెప్పిండ్రు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. పల్లె ప్రజల తీర్పుతో ఆ పార్టీకి దిమ్మతిరిగింది. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటకు బీటలు వారడం మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం.
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు విధుల విషయంలో అవగాహన కల్పించేందుకు త్వరలో వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, కొత్త సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హకులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్‌షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. తుది విడత ఎన్నికల్లోనూ కష్టపడి గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఏనుగు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
అధికార పార్టీ దుర్మార్గాలకు ఎదురొడ్డి అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ సైనికులకు సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలోనూ సత్తాచాటి జయకేతనం ఎగరేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. అలవికాని హామీలిచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గ్రామీణులు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని అభివర్ణించారు.
పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే అధికార కాంగ్రెస్ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే పరిషత్ ఎన్నికల్లో ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్ష విజయం సాధించిందని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలువకపోవడం ప్రజావ్యతిరేకతకు అద్దంపడుతున్నదని చెప్పారు. ‘కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు..రిక్త హస్తం..ప్రజల పాలిట భస్మాసుర హస్తమనే విషయం రెండేండ్ల పాలనలో తేలిపోయింది’ అని చెప్పారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన, దుర్మార్గపు విధానాలతో ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటికి గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 24 నెలలుగా కాంగ్రెస్ సర్కారు అరాచకాలు, మోసాలు, స్కీమ్‌ల పేరిట సాగిస్తున్న స్కామ్‌లపై అనునిత్యం బీఆర్ఎస్ చేస్తున్న సమరాన్ని గుర్తించి గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి పాదాభివందనాలు అని పేర్కొన్నారు.