ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ‘కింగ్డమ్’తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన ప్రస్తుతం ‘రౌడీ జనార్దన్’ చిత్రంతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘రౌడీ జనార్దన్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఈ నెల 18న నిర్మాత దిల్‌రాజు పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. కోనసీమ నేపథ్యంలో పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని, ఆయన సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ సి చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: డినో శంకర్, రచన-దర్శకత్వం: రవికిరణ్ కోలా.