బాబీ సింహా, హెబ్బా పటేల్ జంటగా మెహర్ యరమతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. యువకృష్ణ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశారు. ఇదొక అద్భుతమైన స్క్రిప్ట్ అని, ఇందులో హీరో పాత్ర వినగానే బాబీ సింహానే గుర్తొచ్చారని, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని నిర్మాత యువకృష్ణ తెలిపారు. ‘ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగులో హీరోగా చేయాలనుకున్నప్పుడు మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ కథ విన్నాను. ఇందులోని పాత్ర ఒక నటుడిగా నాకు ఛాలెంజ్. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ నెల 22 నుంచి వైజాగ్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నాం’ అని బాబీ సింహా చెప్పారు. ఇంకా హెబ్బాపటేల్, నటులు తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కృష్ణదాస్, సంగీతం: సిద్ధార్థ సదాశివుని, నిర్మాణం: యువ ప్రొడక్షన్స్.