KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు.. మన బాధ తెల్వదు అని అన్నారు. అశోక్‌నగర్‌లో చాయ్‌పే చర్చా పెట్టింది అసలు రాహుల్‌గాంధీకి గుర్తుందా అని ప్రశ్నించారు. యువత తలరాత మారుస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారని.. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయి? విద్యా భరోసా ఏమైందని అడిగారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ జేబులు నిండుతున్నాయని.. తెలంగాణలో లూటీ జరుగుతోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో మొహబ్బత్‌కి దుకాణ్ కాదు.. ధోకేకా మకాన్ నడుస్తోందని ఆరోపించారు. కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారని మండిడ్డారు.
ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపడ్డారు. డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం కాదు.. ఉన్మాదపర్వం చూపిస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల పట్ల దౌర్జన్య కాండ కొనసాగుతోందని తెలిపారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల ఆక్రోశం కనబడటం లేదా అని నిలదీశారు. నిరుద్యోగ అభ్యర్థుల శోకాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాడులు, ఓయూలో నిర్బంధాలు కనిపించడం లేదా అని అడిగారు. ఢిల్లీలో రాజ్యాంగం చేత పట్టుకుని రాహుల్ గాంధీ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే పట్టించుకునే వారే లేరని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు వదిలిపెట్టనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. నవంబర్ 22న అవినీతి సొమ్ముతో జాబ్ క్యాలెండర్‌పై యాడ్లు వేశారని గుర్తుచేశారు. కానీ ఇవాళ జాబులు లేవు.. జవాబులు లేవని విమర్శించారు. ఉద్యోగాలు లేవు.. క్యాలెండర్ మారినా.. జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితాలుగా మారిందని విమర్శించారు. చరిత్రను మరిచిపోతే భవిష్యత్ తరాలు క్షమించవని హెచ్చరించారు.
చరిత్రలు, ఇతిహాసాలు, పురాణాలు చదవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. తెలంగాణ ఉద్యమాల్లో చావగొట్టిన వాళ్లే మళ్లీ అధికారంలోకి వస్తారని తెలిపారు. కాంగ్రెస్ అలవిగాని హామీలు నమ్మి తెలంగాణ యువత మోసపోయిండ్రు అని తెలిపారు. 1952, 1969లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువత గుండెల్లో గుణపాలు నింపిందని గుర్తుచేశారు. వేలమంది యువత ప్రాణాలు తీసుకున్నా కాంగ్రెస్‌కు రక్తదాహం తీరడం లేదని అన్నారు. మన రక్తం పొలాల మీద చల్లాలని చిల్లరమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు, యూత్, మహిళ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. ఓటు కోసం కోటి మోసాలు చేస్తున్న కాంగ్రెస్ తీరు దేశానికి తెలియాలన్నారు.