KTR | ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్ల సమాహారం, 21 పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, 1531కి.మీ. కాల్వలు అని వివరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు గురించి నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా.. పూర్తి కాలేదని కేటీఆర్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని పేర్కొన్నారు. కానీ మండుటెండలో, కరువులోనూ నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ సర్కార్ మరమ్మతులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ పిల్లర్ల బ్లాక్‌ను నిర్మించేందుకు రూ.4కోట్లు అవుతాయని పేర్కొన్నారు. ఎల్అండ్టీ ముందుకు వచ్చినా ఇంతవరకూ మరమ్మతు చేయలేకపోయారని చెప్పారు. కాళేశ్వరం కూలేశ్వరమైందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ మండిపడ్డారు.మూడు కాలాలూ తట్టుకుని నిలబడేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని స్పష్టం చేశారు. మిడ్ మానేరు నుంచి నీళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఫ్లడ్‌ఫ్లో ద్వారా పంప్‌లు ఆన్ చేయకుండానే నీళ్లు తరలించవచ్చని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చని చెప్పారు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి అని అన్నారు.
ఇప్పుడు 98వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ అవసరం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తరలించవచ్చని పేర్కొన్నారు. కన్నెపల్లి వద్ద నీళ్లున్నాయి.. పంపులు ఆన్ చేయమని రైతులు ఆందోళన చేశారని అన్నారు. మిడ్ మానేరు నింపాలని రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ కోరినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. నీటి లభ్యత ఎక్కడా లేకపోతే కన్నెపల్లి నుంచి తీసుకోవచ్చయని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీలోనూ నీళ్లు లేకుంటే రివర్స్ పంపింగ్‌లో నీళ్లు నింపుకోవచ్చని తెలిపారు. 7 జిల్లాలకు సాగు, తాగు నీళ్లిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరమని అన్నారు. కాకతీయ కాల్వలో నీళ్లులేని పరిస్థితుల్లో నీళ్లిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు. అప్పర్ మానేరు అలుగు పొంగిందంటే కాళేశ్వరం వల్లనే అని తెలిపారు. హైదరాబాద్‌లో తాగునీటి కోసం ఇవాళ 15వేల వాటర్ ట్యాంకర్లు పెరిగాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 94వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతాయని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదు సరే.. ఉత్తమ్‌కు స్పృహ లేదా అని ప్రశ్నించారు. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదని నిలదీశారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం వచ్చాకనే కదా నీళ్లొచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతు బతుకు బాగుపడిందని తెలిపారు. పంజాబ్‌ను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలిచిందని అన్నారు. కాళేశ్వరంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మృతిచెందితే ఇంతవరకూ మృతదేహాలను తీయలేదని పరిస్థితి ఉందని విమర్శించారు. మీ హయాంలో సుంకిశాల గోడ కూలలేదా అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. వట్టెం పంప్‌హౌస్ కొట్టుకుపోయినా పట్టించుకోరని అన్నారు.