హైదరాబాద్: సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణం ఆవేదన కలిగించిందన్నారు. ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా, 750కి పైచిలుకు చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారని తెలిపారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య నటుడిగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. పద్మశ్రీ, తొమ్మిది నంది అవార్డులు, ఎన్నో ఇతర పురస్కారాలు అందుకున్న ఆయన, తన నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారని వెల్లడించారు.
రాజకీయ రంగంలో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన, సమాజానికి తన వంతు సహకారాన్ని అందించారని చెప్పారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఈ దుఃఖ సమయంలో కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో, 750కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఒక విలక్షణ నటుడని కొనియాడారు. చిరస్మరణీయమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోట మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటని చెప్పారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.