Congress | హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకున్నది. సోమవారం దీక్షాదివస్‌లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గం గుల కమలాకర్, మల్లారెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ తదితరులు గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి హాజరయ్యేందుకు బయల్దేరారు. అసెంబ్లీ గేటు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్‌ను మోహరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోనికి వెళ్లనివ్వలేదు. అదానీ-రేవంత్ మధ్య చీకటి బంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ ఫొటోలు ముద్రించిన టీ-షర్టులను ధరించగా, లోపలికి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమకు నిరసన తెలిపే హక్కు లేదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసులతో కేటీఆర్, హరీశ్‌రావు వాగ్వాదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఏమిటని, తమ హక్కులను కాలరాయడమేనని అగ్రహం వ్యక్తంచేశారు. లోపలికి అనుమతించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ఒకదశలో పోలీసులను తోసుకొని వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి, గంటపాటు ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
తెలంగాణను అదానీకి దోచిపెట్టే కుట్ర: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ వనరులను, సంపదను అదానీకి దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ ముందు ఆయన మాట్లాడుతూ.. రేవంత్-అదానీ అపవిత్ర కలయికపై, కుమ్మ కు రాజకీయంపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అదానీకి అనుచితమైన లబ్ధి చేకూర్చే విధంగా రేవంత్ కుట్రలకు పాల్పడుతుంటే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఆదానీతో కొట్లాడుతున్నట్టు నాటకాలు ఆడుతూ.. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను, తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
రాహుల్ వెళ్లొచ్చు కానీ మమ్మల్ని వెళ్లనివ్వరా?
టీషర్ట్ వేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. పార్లమెంటు ప్రొసీజర్స్ దేశమంతా ఒకేవిధంగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే రోడ్డు మీద నిలబెట్టారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్, ప్రియాంకతోపాటు 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ గల టీషర్ట్ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ, తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అదానీపై కాంగ్రెస్ తీరు ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీలా ఉన్నదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక.. పోలీసుల ద్వారా తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వచ్చేదా? తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఉండే దా? అని కేటీఆర్ ప్రశ్నించారు అదానీతో రేవంత్‌రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతామని స్పష్టంచేశారు. అదానీ-రేవంత్ మధ్య చీకటి ఒప్పందాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామంటే.. అసెంబ్లీ గేటు వద్దనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. స్పీకర్ ఆదేశాలతో పని లేకుండా ప్రభుత్వంలోని వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీకి రేవంత్ డబ్బుల సంచులు
అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి అంటకాగడంపై, ఒప్పందాలు చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మౌనానికి కారణం రేవంత్ ఢిల్లీకి పంపిస్తున్న డబ్బు సంచులేనని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అదానీతో చేస్తున్న వ్యాపారాలపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టంచేయాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేటలో వేల ఎకరాలను అదానీకి ధారాదత్తం చేసేందుకు స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. అదానీకి భూ ములు కట్టబెట్టేందుకు రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ విధానాలు, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సరార్ ఎన్ని నిర్బంధాలు పెట్టినా, దాడులు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని స్పష్టంచేశారు.
అదానీ.. రాహుల్‌కు దొంగలా.. రేవంత్‌కు దోస్త్‌లా : హరీశ్‌రావు
అదానీ వ్యవహారంలో ఢిల్లీ కాంగ్రెస్‌ది ఒక తీరు అయితే, గల్లీ కాంగ్రెస్‌ది మరో తీరుగా ఉన్నదని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ అదానీ ఛోర్ హై అం టుంటే, గల్లీ కాంగ్రెస్ అదానీని భాయ్భా య్ అంటున్నదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీకి అదానీ దొంగలా కనిపిస్తుంటే, రేవంత్‌రెడ్డికి దోస్త్‌లా కనిపిస్తున్నారని దు య్యబట్టారు. ఇందులో ఎవరిది కరెక్ట్ అని ప్రశ్నించారు. ఒకే పార్టీలో నాయకుడిది ఒక తీరు.. రేవంత్‌రెడ్డిది ఒక తీరా? అని ప్రశ్నించారు. తాము అసెంబ్లీ లోపలికి వస్తే గతం లో అదానీతో చేసుకున్న రూ.12 వేల కోట్ల చీకటి ఒప్పందాలు బయటకొస్తాయనే భయమా? అని ప్రశ్నించారు. ‘నువ్వు తప్పు చేసినవ్ కాబట్టే, మా గొంతు నొక్కు తున్నవ్’ అంటూ మండిపడ్డారు. చీకటి ఒప్పందాలు, రహస్య బంధాలు ఎక్కడ బయటపడుతాయోననే భయంతోనే తమ ను ఆపుతున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఏకపక్షంగా జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.