హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు తెలంగాణపై సోయిలేదని, వారిద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రాష్ర్టానికి పనిచేయని మంత్రుల్లో కిషన్‌రెడ్డి మొదటి స్థానమైతే, బండి సంజయ్‌ది రెండో స్థానమని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కలేదని, సొంత రాష్ర్టానికి న్యాయం చేయడంలో ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, న్యాయం చేసేందుకు ఎందుకు కనీస చొరవ చూపడం లేదని నిలదీశారు. వారి ఆధ్వర్యంలో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా రాష్ర్టానికి తేలేదని దుయ్యబట్టారు. తెలంగాణపై సోయి ఉన్నవాడు ఒక్కరూ కేంద్రంలో లేరని ఘా టుగా దుయ్యబట్టారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటినుంచి తప్పుదారిలో వెళ్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎంగా అనుభవరాహిత్యం కారణంగానే రేవంత్‌రెడ్డి ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నారని చెప్పారు. ఆయన రియల్ ఎస్టేట్ రంగానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్‌రెడ్డి కేవలం స్టేట్మెంట్ ఇచ్చి, ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయం ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారని విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఇలాంటి దొంగచాటు నిర్ణయాలు గత రెండేండ్లుగా తీసుకుంటూనే ఉన్నాడని దుయ్యబట్టారు. హైదరాబాద్ మెట్రోపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. గత రెండేండ్లుగా మెట్రో పనులు సాగి ఉంటే ఎయిర్‌పోర్టుకు సౌకర్యం మెరుగుపడేదని చెప్పారు. 70 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో ఏనాడూ కేంద్ర మంత్రితో మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఈ మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ ప్రజలపైనే ఉన్నదని తేల్చి చెప్పారు. కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ సీపీఎం నాయకులు స్పందించాలని సూ చించారు. వచ్చిరాని ఇంగ్లిష్‌లో రేవంత్‌రెడ్డి కేరళలో మాట్లాడుతుంటే అక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇక్కడ దోచుకున్న డబ్బును ఇతర రాష్ర్టాల్లో పంచుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ నగర పరిధిలో మూసీ సుందరీకరణ, హెచ్‌సీయూ, హిల్ట్ పాలసీ, టీడీఆర్‌తో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భూములు కొల్లగొడుతున్నారని విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను తన అనుచరులకు కట్టబెడుతూ.. తన ఆస్తులను సీఎం రేవంత్‌రెడ్డి పెంచుకున్నారని మండిపడ్డారు. బంగారుగుడ్డు పెట్టే బాతులాంటి హైదరాబాద్ నడిబొడ్డున ఉండే 250 ఎకరాలను తాజాగా కొల్లగొట్టేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఎల్అండ్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ, కేసు పెట్టి జైల్లో వేస్తామని బెదిరించి, మెట్రోకి చెందిన 250 ఎకరాలను రేవంత్‌రెడ్డి కాజేసే యత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తాము అధికారంలో ఉండి ఉంటే, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేసే వాళ్లమని వివరించారు. మేడ్చల్ వైపు సైతం మెట్రో పూర్తిచేసే వాళ్లమని తెలిపారు.