వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇర్కోడు పైపుడ్ ఇరిగేషన్ కు సంబంధించి ఎల్లారెడ్డిపేటలోని మినీపంప్ హౌజ్ పనులను రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… కేవలం నాలుగేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు కొని కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు పనులు పూర్తి చేశారని, రేవంత్ సర్కార్ మాత్రం రెండేళ్లలో పూచిక పుల్లంత పనికూడా చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో ఇర్కోడ్ పైపుడ్ ఇరిగేషన్ కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 21 గ్రామాలలో 17,385 ఎకరాలకు సాగునీరు అందుతుంని చెప్పారు. ఎల్లారెడ్డిపేటలోని ఫైఫుడ్ ఇరిగేషన్ నెట్వర్క్ మినీ పంప్ హౌజ్ ను ఎల్లారెడ్డిపేట వద్ద గల తాము అధికారులతో సమీక్ష నిర్వహించినా పనులు నత్తనడకన సాగుతున్నాయని, బిల్లులు తీసుకొని పనిచేయడం లేదన్నారు.
ఎల్లారెడ్డిపేటలోని మినీ పంప్ హౌజ్లో సబ్ స్టేషన్, పంప్ వ్యవస్థ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లులో పనిచేసినట్లు నలుగురు కార్మికులతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలా పనులు సాగితే రెండేళ్లయినా సాగునీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గం అంటేనే వ్యవసాయ ఆధార నియోజకవర్గమని, సాగునీళ్లు లేకుంటే వ్యవసాయం సాగదన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంపై దృష్టి సారించాలని, పెండింగ్లో ఉన్న ఉప కాలువలను వెంటనే పూర్తిచేయాలని, పైపుడ్ ఇరిగేషన్ నెట్వర్క్ పూర్తి చేయాలని ఆయన కోరారు.
కేసీఆర్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషప్రచారం మానుకొని మల్లన్న సాగర్లో నీళ్లు వచ్చేలా చూడాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా పంటలు ఎండిపోతున్నాయని, మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీటి సమస్యపై ప్రభుత్వం స్పందించని పక్షంలో దుబ్బాక నియోజకవర్గ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.