అమరచింత : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పాలమూరు కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు (Commissions) అందించడం కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Former MLA Chittem ) ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్ సింగ్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (Kodangal lift irrigation) కమీషన్లు దండుకునేందుకు డీపీఆర్ లేకుండానే రూ. 100 కోట్ల బిల్లులను పెట్టారని విమర్శించారు. కేసీఆర్ చొరవతో భూత్పూర్ కెనాల్ నుంచి కాలువల ద్వారా నర్వ, అమరచింత, ఆత్మకూర్ తదితర గ్రా
మాల్లోని చెరువులను నింపుకొని రైతులు పంటలను సాగు చేసుకోవడంతో పాటు, మత్స్యకారులు ఉచిత చేప పిల్లల పథకంతో జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మొత్తం నియోజకవర్గ ప్రాంతం పచ్చగా ఉంటే చూడలేని సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఎండబెట్టి భూత్పూర్ కెనాల్ నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
పాలనపై అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి పాలనే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ను విమర్శిస్తూ కాలయాపన గడుపుతున్నారని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందజేయాలని డిమాండ్ చేశారు.
భూత్పూర్ కెనాల్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తే అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాల్లోని గ్రామాలు ఎడారిగా మారుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బదులుగా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే 60 వేలకు పైగా బీడు భూములు సాగులోకి వస్తాయని తెలిపారు.
ఈ సమావేశంలో అమరిచింత మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంగమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ నాగభూషణం గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు జింక రవి, చిన్న బాలరాజు, ఆత్మకూరు మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు రియాజ్ ఆలీ,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.