Dhol Player Sakini Ramachandraiah | సంస్కృతికి వారధులు.. ఆదివాసీలు. వీరిలోనూ అనేక తెగలు. విభిన్న సంప్రదాయాలు, భాషలు, వేషధారణలు. తెలంగాణ గిరిజన తెగల్లో ఒకటైన ‘కోయ’లకు ఆశ్రితులుగా ఉండే ‘డోలి’ కళాకారుల జీవన విధానం మరింత ప్రత్యేకం. ఇటీవలే ప్రఖ్యాత డోలి కళాకారుడు రామచంద్రయ్య.. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన జీవనగమనాన్ని తెలుసుకుంటే, డోలి కళాకారుల బతుకు చిత్రాలను పరామర్శించినట్టే.
Dhol Player Sakini Ramachandraiah
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం.. సకిని రామచంద్రయ్య స్వగ్రామం. తల్లిదండ్రులు ముసలయ్య-గంగమ్మ. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను ఓ బాధ్యతగా స్వీకరించారు. పన్నెండేండ్ల వయసులోనే ‘డోలి’ కళపై మక్కువ పెంచుకొన్నారు. కంచు తాళం, మేళం చేతపట్టి కాళ్లకు గజ్జె కట్టి.. డోలి వాయిస్తూ కోయల పుట్టు పూర్వోత్తరాలను పాటల రూపంలో వివరిస్తారు. తెలుగు, కోయభాషల్లో కథలు చెప్పడంలో పట్టు సాధించారు. డోలు వాయిద్యంతో దైవకార్యాలు, జాతరలు, ఆదివాసీ పండుగలు, వివాహాది శుభకార్యాల వద్ద తన స్వరఝరిని వినిపిస్తూ.. ఆహూతులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతారు.
తన పాటలు, కథల ద్వారా యాభై ఏండ్లుగా తరతరాల కోయ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న చరిత్రకారుడు.. రామచంద్రయ్య. నిరక్షరాస్యుడైనా, కోయ తెగకు సంబంధించిన అనేక కథలు కరతలామలకం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన ‘సమ్మక్క-సారలమ్మ’తోపాటు గిరికామరాజు, పగిడిద్ద రాజు, రామరాజు, గాడిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ మొదలైన ఆదివాసీ యోధుల కథలను రామచంద్రయ్య గానం చేస్తారు. గిరిజన తెగల పుట్టుక, వంశ మూల పురుషుల చరిత్రను కథల రూపంలో చెప్పడం డోలి కళాకారుల వృత్తి. వీరికి ఇంటోళ్లు, నాగ స్తంభం వారనే పేర్లు కూడా ఉన్నాయి. కోయల ఇండ్లలో పండుగలు, ముఖ్య దినాల్లో డోలీల పాత్ర కీలకం. ఇక వివాహాల్లోనైతే.. వీళ్లే పూజారుల పాత్ర పోషిస్తారు. దగ్గరుండి పెండ్లి జరిపిస్తారు. గట్టుల వారీగా వివరాలను తెలుసుకొని, ఏ గట్టు వారు ఏ గట్టు వారిని వివాహం చేసుకోవాలో, చేసుకోకూడదో నిర్ణయించే పని కూడా డోలీలదే.
రెండేండ్లకోసారి కోలాహలంగా జరిగే.. మేడారం సమ్మక్క-సారక్క జాతరలో రామచంద్రయ్య తప్పనిసరిగా ఉండాల్సిందే. అమ్మవార్ల రాక సందర్భంగా ఈయన డోలి వాయిస్తూ వనదేవతలకు పూజలు చేస్తారు. గత యాభై ఏండ్లుగా మేడారం జాతరలో వనదేవతల పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తున్నారు. చదువు రాకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా వినసొంపైన గళంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో వేల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
కోయ తెగల చరిత్రను, విశిష్టతను గానం చేస్తూ, కోయ సంస్కృతి – సంప్రదాయాలను కాపాడుతున్న రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘పద్మశ్రీ’ పురస్కారం అందజేసింది. తద్వారా మారుమూల అటవీప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి, దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. డోలి కులస్థులు భద్రాచలం, ఏటూరునాగారం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రను చెప్పే ఏకైక కళాకారుడు రామచంద్రయ్యే.
… అరవింద్ ఆర్య, 7997 270 270
Batik Art | జావా దీవుల్లో పుట్టిన ఈ కళ మన దేశంలో ఎలా ఫేమస్ అయింది? దీని స్పెషాలిటీ ఏంటి?
Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..
Thoti Tribes | గోండుల ఇండ్లల్లో పెండ్లయినా.. చావైనా.. వీళ్లు రావాల్సిందే !!
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?