రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి సాగుకు ఫుల్స్టాప్ పెట్టారు.. ఇతర పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు.. జిల్లాలో అత్యధికంగా 30 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు సాగు ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నారు.. మొత్తానికి భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు సజావుగా సాగుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు సజావుగా సాగుతున్నది. వ్యవసాయశాఖ అధికారుల ప్రణాళికలకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు రైతులు ఈసారి వరి సాగు విస్తీర్ణం తగ్గించారు. కేవలం తిండి గింజల కోసమే వరి సాగు చేస్తున్నారు. ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపించారు. మొక్కజొన్న, కంది, కూరగాయల పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. అర్హులందరికీ రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ అందజేశారు. రైతుబీమాకు అర్హులను గుర్తించారు. సాగు విస్తీర్ణానికి తగిన ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచారు.
పంటల విస్తీర్ణం నమోదుతో పాటు రైతు బీమా నమోదు ప్రక్రియ సైతం వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే కేవలం రెండు రోజుల్లోనే మృతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అతి తక్కువ రోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 364 మంది రైతులు మృతిచెందగా వీరిలో 232 మంది మృతుల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయి. వీరిలో 219 మంది కుటుంబాలకు రూ.10.95 కోట్ల పరిహారం అందింది. ప్రభుత్వం సూచించిన నాలుగు విభాగాల సమాచార సేకరణలో భద్రాద్రి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది.
యాసంగిలో జిల్లావ్యాప్తంగా రైతులు వరి సాగు విస్తీర్ణం తగ్గించారు. గతేడాది కంటే ఈసారి 25శాతం విస్తరణ తగ్గినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది యాసంగిలో 78,762 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా ఈ ఏడాది కేవలం 41,481 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 2,649 ఎకరాల నుంచి 31,499 ఎకరాలకు, జొన్న 2,143 ఎకరాల నుంచి 3,330 ఎకరాలకు, కంది 12 ఎకరాల నుంచి 113 ఎకరాలకు పెంచారు. ఇప్పటి వరకు 25,029 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
యాసంగి సాగుకు వ్యవసాయశాఖ అధికారులు పంటలకు ఎరువులను అందుబాటులో ఉంచారు. యూరి యా 19,261 మెట్రిక్ టన్నులు, డీఏపీ 765 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 752 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 7,384 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1,306 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వాటి నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పురుగు మందుల విక్రయంపై ఒక దుకాణ యజమానితో పాటు నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించిన వారిపై చర్యలు తీసుకున్నారు.
పంటల నమోదును పక్కాగా చేపడుతున్నాం. వ్యవసాయశాఖ అధికారులు ప్రతి రైతునూ సంప్రదిస్తున్నారు. మొదట వ్యవసాయ విస్తరణ అధికారులు పంటలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత డివిజనల్ సహాయ సంచాలకులు, జిల్లావ్యవసాయశాఖ అధికారి పరిశీలిస్తారు. దీని ద్వారా పంటల వివరాలు, సర్వే నంబర్లు పక్కాగా తెలుస్తాయి. రైతు బీమా అమలులో భద్రాద్రి జిల్లా అగ్రస్థానంలో ఉంది. రైతు ఏ కారణంతో మృతిచెందినా వారి కుటుంబానికి బీమా వర్తింపజేస్తున్నాం. రెండు రోజుల్లో వివరాలన్నీ ఆన్లైన్ చేస్తున్నాం. బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం