Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 75వేల మందికిపైగా భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. వరుసగా మూడురోజుల్లో రోజుకు 20వేలమందికిపైగా భక్తులు తరలివస్తున్నారు. పంచకేదార్లోని ప్రధాన క్షేత్రమైన కేదార్నాథ్ ధామ్ ద్వారాలను అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 10న తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవం రోజునే రికార్డు స్థాయిలో 29,030 మంది భక్తులు బాబా కేదార్ దర్శనం చేసుకున్నారు. ఆదివారం 23,510 మంది పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ భక్తులు దర్శనాలు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
తెల్లవారు జామున 4గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భక్తులకు గర్భగుడిలో దర్శనాలు జరుగుతున్నాయి. అయితే, ఆ తర్వాత రద్దీ పెరుగుతుండడంతో దూరం నుంచే దర్శనం కల్పిస్తున్నారు. సగటున గంటకు 1,700 మందికిపైగా భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం మూడురోజుల్లో 75,139 మంది కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించారు. గత ఐదేళ్లలో ఇదే రికార్డు. ఈ భక్తుల్లో 49,144 మంది పురుషులు, 25,002 మంది మహిళలు, 991 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరు విదేశీ మహిళలు సైతం బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు.
ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తున్నట్లు బీకేటీసీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ చంద్ర తివారీ తెలిపారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 4 గంటల నుంచి 6.30 గంటల వరకు దర్శనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏడు గంటలకు హారతి కొనసాగుతుందన్నారు. కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజల కోసం బుకింగ్ చేసుకున్న భక్తులకు రాత్రి 11 గంటల నుంచి పూజలు కొనసాగుతున్నాయని.. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న భక్తుల పేరుతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.