సిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్, ఫిబ్రవరి 1 (తెలంగాణ) : రేవంత్ సర్కార్‌పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాలగోపాలమై తెలంగాణ కదిలివచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. తమ అధినేత కేసీఆర్‌పై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్న సర్కార్ దమననీతిని కడిగిపారేసింది. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించింది. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ సర్కార్‌కు కర్రుకాల్చి వాతపెడుతామని ఆగ్రహించింది.
ఊరూవాడ కేసీఆర్‌కు బాసటగా నిలిచింది. పల్లెపట్నం ఏకమై రేవంత్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించాయి. ‘కదిలింది తెలంగాణ..ఖబడ్దార్’ అంటూ నినదించాయి. రాష్ట్రం ఆవిర్భవించిన 12 ఏండ్ల తర్వాత తెలంగాణ మళ్లీ ఉద్యమ పంథా ఎత్తుకున్నది. ఉద్యమ డీఎన్ఏ నుంచి వేరుకాలేదని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆదివారం మరోసారి నిరూపించారు. కేసీఆర్‌ను విచారించడమంటే తెలంగాణను విచారించడమేనని, ఇంతకు ఇంతా కాంగ్రెస్ సర్కార్ అనుభవిస్తుందని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గత నెల 29న సిట్ నోటీసులు జారీచేసినప్పటి నుంచీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను సిట్ విచారించింది. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాకుండా యావత్ తెలంగాణ రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సుదీర్ఘకాలం ఉద్యమించి, తెలంగాణ సాధించి, దేశంలోనే దార్శనిక రాష్ట్రంగా నిలిపిన మహానాయకుడు కేసీఆర్‌కు నోటీసులివ్వడం, విచారణ చేయడం ఏమిటని మండిపడ్డారు.. ఉమ్మడి పాలకులే కేసీఆర్ ధాటికి తట్టుకోలేక శంకరగిరిమాన్యాలు పట్టారని, తన గురువైన చంద్రబాబే పెట్టేబేడ సర్దుకొని పోయారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
సిట్ విచారణకు సహకరించేందుకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ బయలుదేరారనే విషయం తెలుసుకొని రాజీవ్ రహదారి మొత్తం గులాబీ వనమై పూచింది. గౌరారం, ములుగు, వంటిమామిడి సహా అనేక గ్రామాల్లో ప్రజలు రోడ్లమీదికి వచ్చి గుమ్మడికాయ దిష్టితీసి, గులాబీ పూలు చల్లారు. కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి వీరతిలకం దిద్దింది. ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, శామీర్‌పేట, తూంకుంట, అల్వాల్ మీదుగా కేసీఆర్ కాన్వాయ్‌కు ఇరువైపులా బారులు తీరిన ప్రజలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. అందరికీ కేసీఆర్ అభివాదం చేస్తూ కదిలారు.

‘దండు కదిలిందిర జంబాయిరే.. తెలంగాణ కదిలిందిర జంబాయిరే’ అంటూ రాష్ట్రమంతా రేవంత్‌పై తిరుగుబాటు దండోరా మోగించింది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, ఖమ్మం నుంచి కథలాపూర్ దాకా, నల్లగొండ నుంచి నాగర్‌కర్నూల్ దాకా తెలంగాణ అగ్గిపిడుగై ఉరిమింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ నాయకులు ఉద్యమజెండాలెత్తి, బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న కాలంలో నెలకొన్న ఉద్విగ్న వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రీ గురికాని ఛీత్కారానికి, ఆగ్రహానికి రేవంత్‌రెడ్డి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనమయ్యాయి. దిష్టిబొమ్మల శవయాత్రలు కొనసాగాయి. గొర్లు, కోళ్ల తలలకు రేవంత్ బొమ్మలు వేసి నడిరోడ్ల మీద ఉరి తీయడం, మురుగు కాలువల్లో సీఎం దిష్టిబొమ్మలను విసిరేయడం కనిపించింది.
సిట్ విచారణకు హాజరు అయ్యేందుకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.25 గంటలకు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి బయలుదేరారు. అంతకుముందు గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకుడు జహంగీర్ కేసీఆర్ చేతికి దట్టీ కట్టారు. దత్తత గ్రామమైన ఎర్రవల్లివాసులు గుమ్మడికాయతో దిష్టితీసి, గులాబీలు చల్లారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేసీఆర్ కాన్వాయ్ ముందుకు కదిలింది. కేసీఆర్ కాన్వాయ్‌ని బీఆర్ఎస్ శ్రేణులు అనుసరించారు. పాములపర్తి, గౌరారం, ములుగు, వంటిమామిడి మీదుగా కేసీఆర్ కాన్వాయ్ రాజీవ్ రహదారి వెంట బయలుదేరగా, ఊరూరా ప్రజలు పూలవర్షం కురిపించారు. గౌరారం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు గుమ్మడికాయతో దిష్టితీసి, గులాబీపూలు చల్లి స్వాగతం పలికారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత గౌరారం, ములుగు, వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పార్టీ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ రాస్తారోకో చేశారు.

హైదరాబాద్‌లోని నందినగర్ జనసంద్రమైంది. అభిమాన నేతను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను ఆదివారం ఉదయం నుంచి పోలీసులు తెలంగాణ భవన్లో నిర్బంధించారు. రాత్రి 7.40 గంటల ప్రాంతంలో విచారణ ముగిసిందని తెలిసిన వెంటనే వేలాది మంది అభిమానులు పోలీసుల బారికేడ్లను తప్పించుకొని నందినగర్ చేరుకున్నారు. అశేష జనవాహినిని చూసిన కేసీఆర్.. బాల్కనీలోకి వచ్చి అభివాదం చేశారు. జననాయకుడిని చూసిన ఉత్సాహంతో కేరింతలు కొడుతూ.. ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ అంటూ నినదిస్తూ.. చప్పట్లతో హోరెత్తించారు. కేసీఆర్ అభివాదం చేస్తుండగా.. ‘సీఎం.. సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ చేతులెత్తి నమస్కారం చేయగా.. ఒక్కో అభిమాని గుండెలు ఉప్పొంగిపోయాయి. కేసీఆర్ తిరిగి వెళ్లే వరకూ ఉండి అభివాదం చేశారు.