హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల నుంచి కశ్మీర్ సందర్శనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రదాడిని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఖండించారు.