హనుమకొండ, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం.. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తున్నది. సమాజంలోని విభిన్న కళలు, సాహిత్య, సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలకు వేదికగా నిలవాల్సిన కాళోజీ కళా కేంద్రంలో ఈ రంగాల వారు రాకుండా చేస్తున్నది. కాళోజీ కళా క్షేత్రాన్ని సైతం పైసలు రాబట్టే ఓ ఈవెంట్ సెంటర్‌గా మార్చుతున్నది. లక్షలు లేనిదే కాళోజీ కళా క్షేత్రంలో కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితిని తీసుకొచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళా క్షేత్రాన్ని 2024 నవంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రారంభ వేడుకలోనూ కవులు, కళాకారులు, రచయితలకు సంబంధం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి కళా క్షేత్రానికి ఈ వర్గాలను దూరంగానే పెడుతున్నది. కళా క్షేత్రం నిర్వహణ అంతా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. కాళోజీ కళా క్షేత్రం చార్జీలను ‘కుడా’ నిర్ణయించింది. కళలను ప్రోత్సహించే వేదికగా కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేలా ఈ చార్జీలు ఉన్నాయని సాంస్కృతిక, సాహిత్య, కళలు, నాటక రంగాల వారు వాపోతున్నారు.
కాళోజీ కళా క్షేత్రంలో ఓ కార్యక్రమం నిర్వహణకు కనీస కిరాయి రూ.50 వేలు చెల్లించాల్సి వస్తున్నది. అదనంగా క్లీనింగ్, సెక్యూరిటీ, కరెంటు బిల్లు రూపంలో మరో రూ.20 వేల వరకు అవుతున్నది. ఇంత భారీ మొత్తం కావడంతో కాళోజీ కళా క్షేత్రం.. కళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు దూరంగానే ఉంటున్నది. చార్జీలను భారీగా నిర్ణయించడంపై సాంస్కృతిక, సాహిత్య, కళలు, నాటక రంగాల వారు సాంస్కృతిక శాఖకు ఫిర్యాదు చేశారు. అనంతరం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ‘కుడా’ వైస్ చైర్మన్‌కు లేఖ రాశారు. సాంస్కృతిక, సాహిత్య, కళలు, నాటక రంగాల వారికి కాళోజీ కళా క్షేత్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏడాదిలో కొన్ని కార్యక్రమాలను కచ్చితంగా కాళోజీ కళా క్షేత్రంలో నిర్వహించేందుకు ఉచితంగా కేటాయించాలని పేర్కొంటూ కార్యక్రమాల జాబితాను పంపించింది. సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలు, సూచనలపై ‘కుడా’ ఏ మాత్రం స్పందించడంలేదు. బీఆర్ఎస్ హయాంలో కాళోజీ కళా క్షేత్రం నిర్మాణానికి మొదట చర్యలు చేపట్టిన సాంస్కృతిక శాఖ ఆదేశాలను ‘కుడా’ పట్టించుకోవడం లేదని సాహిత్య, సాంస్కృతిక రంగాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతిక, సాహిత్య రంగాల కార్యక్రమాల నిర్వహణపై తగిన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఈ నెల 9న ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కాళోజీ జయంతిని ఏటా రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించినందున ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.