మోర్తాడ్, ఆగస్టు 3: కాళేశ్వర గంగ కదిలొచ్చింది. ఎక్కడో ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎదురెక్కి వచ్చింది. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ చెంతకు చేరింది. ఆదివారమే జిల్లాలో అడుగిడిన కాళేశ్వరం జలాలు సోమవారం ఉదయానికి ముప్కాల్ జీరోపాయింట్ వరకు చేరుకున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట్ వద్ద ఆదివారం మూడు పంపుల ద్వారా 4,350 క్యూసెక్కుల నీటిని వరదకాలువలోకి ఎత్తిపోశాయి. దీంతో సోమవారం ఉదయానికి ఎస్సారెస్పీ వద్ద ఏర్పాటు చేసిన జీరోపాయింట్ వరకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి.
రివర్స్‌పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని ఎన్నో రోజులుగా రైతులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. చివరకు ఆలస్యంగా మేల్కొన్న సర్కారు ఎత్తిపోతలు ప్రారంభించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు ఢోకా లేదని చెబుతున్నారు. గోదావరి జలాలు వరదకాలువ ద్వారా ఎదురెక్కి రావడంతో రివర్స్ పంపింగ్ ఏర్పాటుకు కారణమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27.85 కి.మీటర్ల వరద కాలువ ద్వారా చెరువులను నింపేందుకు ఎనిమిది తూములను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 16 చెరువులు, మూడు చెక్‌డ్యాంలను నింపే అవకాశం ఉన్నది. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో చెరువులు నింపడం లేదు. రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసినప్పుడే తూముల ద్వారా చెరువులను , చెక్‌డ్యాంలను నింపితే తాగు, సాగునీటికి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకుని తూముల ద్వారా చెరువులు నింపాలని కోరుతున్నారు. ఇప్పటికే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వరదకాలువ తూముల ద్వారా చెరువులు నింపాలని పలుమార్లు డిమాండ్ చేసిన విషయం విదితమే.
వరద కాలువలోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడంతో జిల్లా పరిధిలో ఉన్న 0-27.85 కి.మీ. వరకు 300 ఎంసీ ఎఫ్టీ నీటిని నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో వానాకాలం సాగుకు ఎటువంటి ఢోకా ఉండదంటున్నారు. వరద కాలువపై ఆధారపడ్డ రైతులకు సాగునీటి సమస్య పరిష్కారమైనట్లేనని చెబుతున్నారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద గండి పడ్డ ప్రదేశంలో మరమ్మతులు పూర్తి కావడంతో ముప్కాల్ వరకు కాళేశ్వరం జలాలు చేరుకోవడం, వరద కాలువ జిల్లాలో మరోమారు నిండుకుండలా మారడంతో భూగర్భజలాలు పెరిగి సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది.