ఉస్మానియా యూనివర్సిటీ: ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపకుండానే ఆదివాసీలపై దమనకాండకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల హననాన్ని తక్షణమే ఆపేయాలని కోరారు. విలువైన ఖనిజ వనరులను దేశ విదేశీ వాణిజ్య సామ్రాజ్యవాదులు, కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకొని, వారికి అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే ఆదివాసీలు, వారికి అండగా ఉన్న మావోయిస్టులను అంతం చేసే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. ఇరువర్గాలు కాల్పుల విరమణ పాటించి, శాంతి చర్చల వైపు ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాస్తూ పెసా,1/70 చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరారు. శాంతి చర్చల కమిటీ ఉపాధ్యక్షులు జంపన్న మాట్లాడుతూ.. ఆదివాసీల సంక్షేమం దృష్ట్యా ఇరుపక్షాలు శాంతిని పాటించాలని కోరారు.