KTR | ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని తెలిపారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు.
జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలంటే మాగంటి గోపీనాథ్ (గోపన్న)కు ఎంతో అభిమానం ఉండేదని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. గోపన్నపై అబిమానాన్ని మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలు చాటిచెప్పాలని కోరారు. ప్రతిభానగర్ నుంచి రెహమత్ నగర్ వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. 2023లో అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్ నగరే అని గుర్తుచేశారు. ఈసారి 12వేల మెజార్టీ రెహమత్ నగర్ నుంచి వస్తుందని అనిపిస్తోందని తెలిపారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్ అని అన్నారు.
గోపీనాథ్ అకాల మరణం తీరని లోటు అని కేటీఆర్ అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. రెండేండ్ల రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేశాడా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు. మహామహులకు బుద్ధి చెప్పిన ఘనత తెలంగాణ గడ్డదని వ్యాఖ్యానించారు.
అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. పథకాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు. అసలేం పథకం ప్రారంభించావ్ రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా అని అడిగారు. స్పెషల్ ఉర్దూ డీఎస్పీ నిర్వహిస్తామన్నాడు ఏమైందన్నారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్ రెడ్డిని గెలిపించారని చెప్పారు. సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. కేవలం 500 రోజుల సమయమే ఉందని తెలిపారు. 500 రోజుల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్ తిరిగి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్ పేరు పెడతామని తెలిపారు.