క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించి విషంలా కనిపించింది కాబోలు! ప్రభువు మరణానికి కారకులయ్యారు. క్రీస్తు మరణానికి లోక పాపాలే కారణమని తాత్వికులు చెబుతారు. క్రీస్తు మరణానికి తండ్రి ఆనతే కారణమని బైబిల్ గ్రంథం చెబుతుంది. క్రీస్తు మరణానికి తన శిష్యుడు, ఇస్కరియోతే కారకుడని నూతన నిబంధన సాక్ష్యం పలుకుతుంది. యూదులూ, పరిసయ్యులే కారకులని చెబుతారు. ఇవన్నీ వాస్తవాలే! ముఖ్యంగా యూదులు. క్రీస్తు పట్ల, యూదులెందుకు ద్వేషాగ్ని కురిపించారు?
క్రీస్తు తానే మెస్సియాను అని ప్రకటించుకున్నాడు. అప్పటికే మెస్సియా వస్తాడూ అని యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ దేవుని కోసం ఎదురు చూసే ప్రజలు… పురాతన ప్రవక్తలు పెట్టిన కఠిన నియమాలను తూ.చ. తప్పక పాటిస్తూ ఉన్నారు. ఆ యూదుల నియమాల్ని సడలించాడు క్రీస్తు. ఆ రోజుల్లో అక్కడి ప్రజలు పన్ను చెల్లించేవారు. ఆ విధానాన్ని ఖండించాడు ప్రభువు. ఆయన బోధనలన్నీ రోమన్లకు వ్యతిరేకంగా ఉన్నాయనేది వారి భావన. ఈ కారణాలే యూదులు తమ రోమన్ రాజును చేరి, క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రీస్తును పట్టించారు. కొట్టించారు. మరణ తీర్పుతో కలవరి గిరి వైపు నెట్టించారు.