హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్ట్‌లపై ఇరిగేషన్‌శాఖ మంత్రికి అవగాహన లేకుండా పోయింది. అసెంబ్లీ వేదికగా మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఆదివారం కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తిచేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బదులిస్తూ.. ఎప్పటిలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే ప్రాజెక్ట్‌లు పూర్తిచేయలేకపోతున్నామం టూ ఏకరువు పెట్టారు. అది అలా ఉంటే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం ఇష్టారీతిన మార్చిందంటూ చెప్పుకొచ్చారు. తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్‌ను వైరాపైకి మార్చిందంటూ అజ్ఞానాన్ని చాటుకున్నారు.
వాస్తవంగా వెయిన్‌గంగా, వార్ధా నదుల కలయిక తరువాత ప్రాణహిత ఏర్పడుతుంది. ఆ రెండు కలిసిన తరువాత ప్రాణహితపై తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మించాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో బరాజ్‌ను వార్ధా మీదకు మార్చారు. కానీ, మంత్రి ఆ బరాజ్‌ను వైరా మీదికి మార్చారంటూ చెప్పడం గమనార్హం. వైరా ఖమ్మం జిల్లాలో ఉన్నది. దీంతో ప్రాజెక్ట్‌లపై అమాత్యుడికి ఏమాత్రం అవగాహన ఉందో ఇట్టే తెలిసిపోతున్నది. తదుపరి సహచర సభ్యులు వైరా కాదు.. వార్ధా అని చెప్పగా అమాత్యుడు తన మాటలను సవరించుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే తమ్మిడిహట్టి బరాజ్ పనులు చేపట్టి, మూడేండ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ఉటంకించారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ
అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ కోసం బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీలు వాయిదా తీర్మానాలను స్పీకర్‌కు అందజేశాయి. అయితే, సదరు వాయిదా తీర్మానాలన్నింటినీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.