Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన అభిమానులపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. అభిమానులు తనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కంటే తనకు మరో ఆనందం లేదని అన్నారు. అభిమానం కేవలం సినిమాలు చూడటంలోనే కాకుండా, జీవితంలో విజయం సాధించడంలో కనిపించాలని ఆయన సూచించారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ వినగానే తన సినీ ప్రయాణం ప్రారంభమైన రోజులన్నీ గుర్తొచ్చాయని చిరంజీవి తెలిపారు. నటుడిగా నిలదొక్కుకోవాలనే కలతో చెన్నై వీధుల్లో తిరిగిన రోజులు, అదే నగరంలో స్టార్‌గా ఎదిగిన క్షణాలు ఇప్పటికీ తన మదిలో మెదులుతూనే ఉంటాయని చెప్పారు. తన జీవితంలో చెన్నైకి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం అభిమానులేనని చిరంజీవి చెప్పారు. నిర్మాత ఎస్కేఎన్, సాయి రాజేష్, దర్శకుడు రవి నంబూరి, సంగీత దర్శకుడు మణిశర్మ, హీరో కిరణ్ అబ్బవరం వంటి వారందరూ అభిమానంతోనే తనను ఆహ్వానించారని తెలిపారు.అభిమానులు ప్రేమ చూపిస్తే ఆనందమే. కానీ వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిస్తే అదే నాపై చూపించే నిజమైన ప్రేమ. అలాంటి అభిమానులను చూస్తే గర్వంగా ఉంటుంది. వారిని నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను అని చిరంజీవి అన్నారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతోమంది అభిమానులు తమ కష్టంతో ఈరోజు విజయవంతమైన నిర్మాతలు, దర్శకులుగా నిలిచారని చిరంజీవి గుర్తు చేశారు. ఎస్కేఎన్ ఒక ఫ్యాన్‌బాయ్‌గా ప్రారంభించి నేడు సక్సెస్ఫుల్ నిర్మాతగా ఎదిగారని, సాయి రాజేష్ జాతీయ అవార్డులు అందుకునే స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.
కలలు కనండి… కానీ రాత్రి కాదు, పగలు కనండి. ఆ కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి. కంఫర్ట్ జోన్‌ను వదిలి కష్టానికి ఎదురెళ్తే విజయం మీ సొంతమవుతుంది. నేనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని యువతకు చిరంజీవి ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం పక్కింటి అబ్బాయిలా కనిపించే సాధారణ వ్యక్తి అయినప్పటికీ, తన కలల కోసం కష్టపడి హీరోగా నిలిచాడని ప్రశంసించారు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన కిరణ్, ఒకరోజు తాను కూడా హీరో కావాలని కలగన్నాడని, ఆ కలను నిజం చేసుకున్నాడని అన్నారు. ఇప్పటికే పలు విజయాలను అందుకున్న కిరణ్, చెన్నై లవ్ స్టోరీ తో మరో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కథానాయిక గౌరీ ప్రియ నటనను ప్రశంసిస్తూ, తెలుగమ్మాయిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు