Raw Ntr | గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ‘రా ఎన్టీఆర్’ సంస్థ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.’రా ఎన్టీఆర్’ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో సంస్థ కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. “విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు” అంటూ వ్యంగ్యంగా ఓ కామెంట్‌ని జోడిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కొన్ని వారాల క్రితం ఎన్టీఆర్ అభిమానుల పేరుతో ‘ఊరు-వాడ’ అనే భారీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రకటించింది. వంద కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.ఈ ప్రకటన తర్వాత తమిళనాడులో రాజకీయాల్లోకి రాకముందు విజయ్ అభిమాన సంఘాలు చేపట్టిన కార్యక్రమాలతో దీనిని పోలుస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో అదే తరహా దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ ప్రచారంపై ఎన్టీఆర్ కార్యాలయం తరఫున స్పందించిన పీఆర్ బృందం.. ‘రా ఎన్టీఆర్’ సంస్థకు హీరో ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎన్టీఆర్ అధికారిక అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంస్థ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించారు.
వివాదం నడుమ హైదరాబాద్, తిరుపతిలో మీడియా సమావేశాలు నిర్వహించిన సంస్థ ప్రతినిధి సాయి రూప్.. గత ఐదారు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమతో 40 వేల మంది వాలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు.అంతేకాకుండా, “ఎన్టీఆర్ చెప్పినా మేము ఆగం. ‘ఊరు-వాడ’ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. తారక్ తమతో ఎందుకు మాట్లాడటం లేదని కూడా ఆయన బహిరంగంగా ప్రశ్నించారు.సాయి రూప్ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్టీఆర్ పేరు ఉపయోగించి వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని, ఇలాంటి చర్యలు హీరో ఇమేజ్‌కు నష్టం కలిగిస్తాయని అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.అన్ని వైపుల నుంచి వ్యతిరేక స్పందనలు రావడంతో చివరకు ‘రా ఎన్టీఆర్’ సంస్థ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం విశేషంగా మారింది.