సారంగాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే కండ్లముందు కనిపిస్తున్నదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రెండున్నరేండ్లలో చేసిందేమీ లేదని, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ ‘కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సందర్భంగా బుధవారం సారంగాపూర్, బీర్పూర్ మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, ఆయాచోట్ల మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు ఏం ప్రయోజనం దక్కలేదని, కష్టపడ్డొళ్లు కాకుండా ఎవరో వచ్చి ఫలాలు అనుభవిస్తుంటే సహించలేకపోయానని మండిపడ్డారు. 20 నెలలుగా ఓర్పుతో ఉన్నానని, తనకు పదవి ఆకాంక్ష ఉన్నట్టయితే ఓపిక పట్టేవాడిని కాదని, పదవి కంటే ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు.
మనం ఎప్పుడైతే అణిచివేతకు గురవుతామో, అవమాన పడతామో..? అప్పటి నుంచే పోరాటం మొదలు పెట్టాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో తీర్చిదిద్దారని, గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. రేవంత్ రెడ్డి 90రోజుల ప్రగతి ప్రణాళికలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోతే బాగు చేయకుండా ఎంత సేపు కేసీఆర్‌ను దోషిగా చూపాలని, రాజకీయ లబ్ధి పొం దాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని దుయ్యబట్టారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవు తుందని, దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలం గాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. సమావేశాల్లో మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు, మాజీ జడ్పీటీసీలు భూక్యా సరళ, ముక్క శంకర్, కొనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, మాజీ ప్రజాప్రతినిధులు కొండ్ర రాంచందర్ రెడ్డి, చెరుపూరి సుభాష్, గుడిసె జితేందర్ యాదవ్, మోత్కురి ప్రసాద్ గౌడ్, ఆకుల రాజిరెడ్డి పాల్గొన్నారు.