సిద్దిపేట, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎక్కడ చూసినా డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎన్ని శాసనసభ స్థానాలు ?లోక్‌సభ స్థానాలు ఎన్ని కానున్నాయి? అనేది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచనుండటంతో పాటు మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ చేసేలా కేంద్రం అడుగులు వేస్తున్న ది. మహిళా రిజర్వేషన్ కింద ఎన్ని స్థానాలు రావొచ్చు..?అవి ఏ స్థానాలు అయి ఉంటాయి అనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతున్నది.
ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం రెండు లక్షల జనాభాకు ఒక శాసనసభ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2026 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా పెద్ద మార్పులకు దారితీయనున్నదని చెప్పాలి. శాసనసభ స్థానాలు 2027 జనాభా లెక్కలు వచ్చిన అనంతరం వీటి పునర్విభజన జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదు శాసనసభ , ఒక లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. దీంతో పాతవి కొత్తవి కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో 16 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో హు స్నాబాద్, జనగామ, మానకొండూరు శాసనసభ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి.
జిల్లాలో కొన్ని రెండు మూడు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. దుబ్బాక, గజ్వేల్ సిద్దిపేట, మెదక్ జిల్లాలో విస్తరించి ఉండగా, హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో, నారాయణ్‌ఖేడ్, అందోల్ నియోజక వర్గాలు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పటాన్చెరువు సంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీలో విస్తరించి ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో శాసనసభ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండే విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2027 మే వరకు జనాభా లెక్కలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత జిల్లాల పరిధిలో శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
అదనపు స్థానాలు వచ్చే అవకాశాలు
ఉమ్మడి మెదక్ (సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లోప్రాంతం జనాభా, నగరీకరణ పెరుగుదల కారణంగా అదనపు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.డీలిమిటేషన్ తర్వాత జనాభా ఆధారంగా కొత్త నియోజకవర్గాలు, ప్రత్యేకంగా అర్బన్ ప్రాంతాల్లో విభజన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఐదు శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం పెరగవచ్చు..? శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెరగడంతో రాజకీయ ప్రభావం పడనున్నది. కొత్త నాయకులకు అవకాశాలు, పార్టీల మధ్య పోటీ పెరగనుంది.కొత్త రాజకీయ శక్తులు ఎదిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో10.12 లక్షల జనాభా ఉంది. 1) సిద్దిపేట, 2) దుబ్బాక, 3) గజ్వేల్, 4) హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇక్కడి జనాభాను బట్టి మరో కొత్త నియోజకవర్గం ఏర్పడనున్నది. గతంలో చేర్యాల నియోజకవర్గం ఉండే. ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో ఉంది. నూతన పునర్విభజనలో భాగంగా చేర్యాల / కొమురవెల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ జిల్లాలో కొత్తవి పాతవి కలిపి ఐదు శాసనసభ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో 7.67 లక్షల మంది జనాభా ఉంది. ఈ జిల్లాలో మెదక్, నర్సాపూర్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. కొత్తగా తూప్రాన్ లేదా పూర్వపు రామాయంపేట పేరు మీద మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో 15.27 లక్షల జనాభా ఉంది.ఈజిల్లాలో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలు ఉన్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉన్నాయి. వీటిని విడగొట్టనున్నారు. ఈ జిల్లాలో ఉన్న జనాభా లెక్కల ప్రకారం మరో మూడు కొత్తగా ఏర్పడనున్నాయి. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి ఎనిమిది శాసనసభ స్థానాలు అయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో లోక్‌సభ స్థానాలు
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 1)మెదక్ లోక్‌సభ స్థానం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. 2) జహీరాబాద్ లోక్‌సభ స్థానం సంగారెడ్డి జిల్లాలోని అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, జుక్కల్, బాన్సువా డ, ఎల్లారెడ్డి, కామారెడ్డి శాసనసభ స్థానాల్లో విస్తరించి ఉంది. ఇవికాక సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం కూడా విస్తరించి ఉంది. ప్రస్తుతం డీలిమిటేషన్లో భాగంగా లోక్‌సభ విస్తీర్ణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, మెదక్ లోక్స భ స్థానాలు ఉండేవి. ఇవి రెండింటిని పునరుద్ధరించి కొత్తగా ఏది ఏర్పడనున్నది అనేది ప్రశ్న…? ప్రస్తుతం జిల్లాల వారీగా లోక్‌సభ స్థానాలు ఏర్పడితే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి కేంద్రాలుగా మూడు లోక్‌సభ స్థానాలు అయ్యే అవకాశం ఉంది.
33 శాతం మహిళా రిజర్వేషన్
కేంద్రం తాజాగా చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న శాసనసభ స్థానాలతో పాటు కొత్తగా ఏర్పడనున్న స్థానాలను కలిపి రాష్ట్రంలో మొత్తం 179 వరకు చేరుతాయి. ఇందులో నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. ఫలితంగా రాష్ట్రంలో 59 సీట్ల వరకు మహిళలకు వస్తా యి. ఇందులో ఉమ్మడి జిల్లాకు మహిళల కోటా ఎంత రానున్నది… అందులో ఏసీటు మహిళలకు కేటాయించనున్నారు అనేది ప్రశ్న. మహిళలకు దక్కే స్థానాలపై అప్పడే ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీలకు దక్కే స్థానాలపై సైతం రాజకీయ నాయకులు లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.