మావోలపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం, ఇప్పుడు సానుభూతిపరులపై అదే తరహా పంథాను అనురించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగా మావోలతో సంబంధాలున్నట్టుగా లేదా ఎన్కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల అంతక్రియలకు హాజరైన సానుభూతిపరులను విచారించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను రంగంలోకి దింపింది. దీంతో రాష్ట్రంలోని అన్నీ పోలీస్స్టేషన్లను ఎన్ఐఏ జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు మావోలతో సంబంధాలున్నట్టు కేసులు నమోదైన వివరాలను తీసుకొని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తున్నది. అందులో ఉత్తర తెలంగాణలో అత్యధిక నోటీసులు జారీ అయినట్టు తెలుస్తుండగా, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోనే దాదాపు 200కుపైగా వ్యక్తులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు, నోటీస్‌లో పేర్కొన్న తేదీల ప్రకారం హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ స్పష్టంగా పేర్కొనడంతో సదరు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జమ్మికుంట: మావోలను సమూలంగా ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే పలువురు మావోలు ఎన్కౌంటర్లో మృతి చెందగా, మరికొంతమంది నేరుగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఇదే సయంలో ‘ఆపరేషన్ కగార్’ను కొనసాగిస్తూనే మరోవైపు మావోలతో గతంలో సన్నిహిత సంబంధాలున్న సానుభూతిపరులపైన ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ‘మావో’లపై చర్చ పెట్టే అవవాశమే లేకుండా చేయాలనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయన్న చర్చ ప్రస్తుతం సాగుతున్నది.
ఆ మేరకు గతంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల అంత్యక్రియలకు హాజరైన ప్రజాసంఘాలు, బంధుమిత్రుల కమిటీ, తదితర సానుభూతిపరులను విచారించి చర్యలు తీసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. అందుకోసం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను జల్లెడ పడుతున్నది. గతంలో వివిధ సందర్భాల్లో మావోయిస్టు సానుభూతి పరులుగా కేసులు నమోదుకావడం, అలాగే కేంద్ర, రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యులు చనిపోయిన సందర్భాల్లో అంతక్రియల్లో హాజరు కావడం, పోలీసు రికార్డుల ప్రకారం ఏదేని సహకారం మావోలకు అందించినట్టు నమోదు కావడం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని, అందులోని కొంత మందికి నేరుగా ఎన్ఐఏ ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నది. ప్రధానంగా గాజర్ల గణేశ్, కట్టా రాంచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ కాగా, వారి అంత్యక్రియలకు హాజరైన అందరిపై ఫోకస్ పెట్టి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది.
మావోయిస్టు ఉద్యమానికి మారుపేరుగా ఉత్తర తెలంగాణ నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మందిసానుభూతి పరులుండేవారు. రాను రాను ఆ ప్రభావం తగ్గుకుంటూ వచ్చినా ఇప్పటికీ విప్లవ భావాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 200 మందికి పైగా వ్యక్తులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసినట్టు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. కరీంనగర్ జిల్లాలోని ఒక హుజూరాబాద్ డివిజన్‌లోనే 40 మందికిపైగా వ్యక్తులకు ఎన్ఐఏ నుంచి నోటీసులు అందాయి. అందులో పలువురు గతంలో పార్టీలో పనిచేసి లొంగిపోయిన వారున్నారు. అలాగే బంధుమిత్రుల కమిటీ, ప్రజాసంఘాలు, తదితర సానుభూతిపరులున్నారు. మావోలతో సన్నిహిత సంబంధాలు.. మావోల భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, కొన్ని సందర్భాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం, మృతి చెందిన మావోల అంత్యక్రియలకు హాజరుకావడం, మావోల కుటుంబ సభ్యులను కలవడం తదితర అంశాలను ఎన్ఐఏ పరిగణలోకి తీసుకున్నట్ట తెలిసింది.
కొంతకాలంగా ‘ఆపరేషన్ కగార్’ కొనసాగుతుండగా.. మావో సానుభూతిపరులను కూడా పిలిపించి విచారణ చేసి, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ నోటీసులు జారీ అయినట్టు భావిస్తున్నారు. అందులో భాగంగానే కొందరని ‘అర్బన్ నక్సల్స్’గా గుర్తించి కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఎన్ఐఏ నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్ జరిగిన సందర్భాల్లో అంతక్రియలకు వెళ్లిన వారున్నట్టు తెలుస్తున్నది. గడిచిన రెండేళ్లలో ఎక్కువగా ఆక్టివ్‌గా మావోల కోసం తిరుగుతున్న వారందరి లిస్టు కూడా తీసుకున్నట్లు వినికిడి. దీంతో ఇప్పటికే కేసులు నమోదైన వారితోపాటు సానుభూతి పరులుగా ఉన్న వారికి సైతం ఈనోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. అందరిపై యూ/ఎస్ 152 ఆఫ్ బీఎన్ఎస్, సెక్షన్ 13 అండ్ 39 ఆఫ్ యూఏ(పీ) ఆక్ట్,1967 కింద కేసులు నమోదైనట్టు నోటీసులో దర్యాప్తు సంస్థ పేర్కొన్న తేదీ ప్రకారం సదరు వ్యక్తులు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించింది. నేరుగా ఎన్ఐఏ నుంచి నోటీసులు రావడంతో సదరు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న భయపడుతున్నాయి. అయితే అందులో భయపడాల్సిన అవసరం లేదని, విచారణలో తెలిసిన వాస్తవాలు చెప్పాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.