జగిత్యాల, ఏప్రిల్ 15: జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు లక్ష మందికిపైనే తరలించి విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి రైతుభరోసా ఎగ్గొట్టి రైతులను నిండా ముంచాడని, అధికారంలోకి రాకముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయాడని మండిపడ్డారు.
రైతు సంక్షేమ పథకాలతో రైతులను రాజుగా చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను రాబోయే ఎన్నికల్లో గద్దె దించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి, అందులో సగం కూడా అమలు చేయలేదని, ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట రూ.1.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధులతో రాష్ట్రంలోని పేదలందరికీ ఐదేండ్లపాటు పింఛన్లు ఇవ్వచ్చని తెలిపారు. రెండున్నరేండ్లలో రేవంత్ చేసిందేమీలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి బలంగా వీస్తున్నదని చెప్పారు. కాగా, కేసీఆర్ సభకు ప్రజలు రాకుండా కరీంనగర్-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న పాత బ్రిడ్జిని కూలగొట్టి అడ్డంకిగా పెట్టారని విమర్శించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అరాచకం పెరిగిపోయిందని, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ‘నరుకుతాం’ అని మాట్లాడడం సరికాదన్నారు.
తాను 30 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ జెండాను మోసిన వారిని ఎప్పటికీ కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో విసిగి పోయిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారని, మనమంతా తోడుగా ఉండి కేసీఆర్ను మళ్లీ సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మారంపెల్లి శ్రీనిక ‘రేవంత్ పాలన’పై పాడిన పాట ఆకట్టుకున్నది. రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్ రాథోడ్, అవారి శివకేసరిబాబు, తోట హరీశ్, కోరుకంటి రాము, జగిత్యాల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, అల్లాల ఆనంద్ రావు, తురగ శ్రీధర్ రెడ్డి, తేలు రాజు, కొల్ముల రమణ, ఉదయశ్రీ, మారంపెల్లి రాణి, శీలం ప్రవీణ్, సన్నిహిత్ రావు, అయిల్నేని ఆనందరావు పాల్గొన్నారు.