న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతికపరమైన సంబంధాలు బలపరుచుకునే దిశగా చర్చలు సాగినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అనంతరం ఢిల్లీలో జరిగిన 14వ ఇండో-జపాన్ వార్షిక సదస్సుకు ఇరువురూ హాజరయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు జరిగాయి. సమావేశం అనంతరం ఇరువురు కలసి మాట్లాడారు. భారత్, జపాన్ మధ్య సంబంధాలు ఇరు దేశాలకు మాత్రమే ఉపయోగకరం కాదని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొదిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కాగా, వచ్చే ఐదేండ్లలో భారత్లో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు కిషిదా ప్రకటించారు.