Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ తెలంగాణలో జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చినవారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. 10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని.. త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని తెలిపారు.
హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ హిల్ట్ పి పాలసీ అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ, ORR దగ్గర ఎకరం రూ.137 కోట్లు పలికిందని చెబుతున్న ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములను కారు చౌకగా కట్టబెడుతున్నారని అన్నారు. పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. ల్యాండ్ మార్క్ ఇన్సెటివ్ కాదు.. ల్యాండ్ స్కామ్ ఇన్స్టేటివ్ ఇది అని విమర్శించారు. దొంగలు, దొంగలు భూములు పంచుకోవడమే ఈ ల్యాండ్ స్కామ్ ఇన్సెటివ్ అని చెప్పారు.
నాచారం బాలానగర్‌లో గజం 1.5లక్షలు ఉంటే.. ఇవాళ రూ.10 వేలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎకరాకు 3 కోట్ల ఆదాయం వస్తే, రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్ల లాభం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎకరానికి రూ.50 నుంచి 70 కోట్లు రావాల్సి ఉంది.. కానీ అది రావడం లేదని తెలిపారు. ఇలా దాదాపు 20 వేల ఎకరాల భూమిని తమ బంధువులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ భూములు ప్రజల అవసరాలకు ఉపయోగపడాలని ఆనాడు కేసీఆర్ చెప్పారని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. పార్కులు, ఆస్పత్రులు కట్టేందుకు ప్రభుత్వ భూములు ఉపయోగపడాలని చెప్పేవారని అన్నారు. లంగ్ స్పేస్లా ప్రభుత్వ భూములను ఉపయోగించుకోవాలన్నారు. ఇవాళ ఢిల్లీ వంటి పరిస్థితి హైదరాబాద్‌లో రాకూడదని అన్నారు. డబ్బు దాహంతో భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు. ఆనాడు కేటీఆర్, హరీశ్‌రావుతో కూర్చొని పారిశ్రామిక భూములను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానీ సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీకి తెరలేపారని అన్నారు. మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని అన్నారు. పారిశ్రామికవాడలోని భూములను ఎవరికి కేటాయించారో వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కేవలం 40 మంది ముఖ్యమంత్రి బంధువులకే నాలుగు కోట్ల ప్రజల ఆస్తిని కట్టబెట్టినట్లు తెలుస్తోందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ భూములను ఎవరికి కేటాయించారో, వారి పేర్లను బయటపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారి ఇండ్లను కూలగొట్టిన మీరు.. ప్రజల భూములను ఇష్టమొచ్చినట్లు రేవంత్ రెడ్డి బంధువులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ పేరుతో జరుగుతున్న దోపిడీని తిప్పికొడతామని తెలిపారు. తాము ప్రజల పక్షాన ఉంటామని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దోచుకున్న ఆస్తులను కాపాడి తిరిగి ప్రజలకు కట్టబెడతామని స్పష్టం చేశారు.