రేవంత్‌రెడ్డి ఏజెంట్లుగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నరు. రేవంత్‌రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నడు.. రేవంత్‌రెడ్డిని తిడితే బండికెందుకు ప్రేమ పొంగుకొస్తున్నది? ఏంది మీ మధ్య సంబంధం? -జగదీశ్‌రెడ్డి
MLA Jagadish Reddy | సూర్యాపేట, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఎందుకు వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘రేవంత్‌పై బండికి ప్రేమ ఎందుకు పొంగుకొస్తున్నది? ఏంటి మీ మధ్య సంబంధం? బండిది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంత్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి’ అని చురకలంటించారు. బీఆర్ఎస్, కేటీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య అంతర్గత లావాదేవీలున్నయి. అందుకే సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి అధిష్ఠానం ఊడబీకిందని బీజేపీ నేతలే అంటున్నరు’ అని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, అసెంబ్లీలో మాపైనే దాడి చేస్తున్నరు. బయట కూడా మా పైనే మాట్లాడుతున్నరు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసినా.. ప్రజలకు ఇండ్లు ఇస్తామని నమ్మబలికి హైడ్రా, మూసీ పేరిట ఉన్న ఇండ్లను కూడా కూల్చి వేస్తున్నా.. అమాయకుల భూములను లాక్కుంటూ ఎదురు తిరిగితే జైళ్లకు పంపుతున్నా.. మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి కరెంటు తీసి జైళ్లకు పంపుతున్నా బండి సంజయ్, బీజేపీ కిమ్మనడం లేదు’ అని మండిపడ్డారు.
‘దాడులు జరుగుతున్నా, కేసులు పెడుతున్నా అన్నింటినీ ఎదిరించి ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్పైనే బీజేపీ దాడి చేయడం సిగ్గుచేటు. నాడు కవితను అరెస్టు చేయాలని బీజేపీని కాంగ్రెస్, నేడు కేటీఆర్‌ను అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరడం రెండు పార్టీల సంబంధాన్ని బయటపెడుతున్నది’ అని పేర్కొన్నారు. విచిత్రంగా చాలా మంది బీజేపీ నాయకులు, ఎంపీలు లగచర్ల, హైడ్రా విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రేవంత్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నాడని నిప్పులుచెరిగారు. ‘ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. రైతుల తరఫున జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నం. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం రద్దుతోనే రాష్ర్టానికి నష్టం జరిగింది.. ఈ కేసులో చివరికి రేవంత్‌రెడ్డే జైలుకు వెళ్తాడు రాసిపెట్టుకో’ అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ‘రేవంత్‌రెడ్డికి, బీజేపీ నాయకులకు.. ప్రత్యేకించి బండి సంజయ్‌కి అంతర్గత, ఆర్థిక సంబంధాలు, భూలావాదేవీలున్నట్టు ప్రపం చం మొత్తానికి తెలుసు. ఆ దందాలు కొనసాగేందుకు రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే కుట్రలకు పాల్పడుతున్నయ్. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ను దిగజార్చాలంటే వారి జేజమ్మలు దిగివచ్చినా కాదు’ అని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి, బీజేపీ నాయకులకు.. ప్రత్యేకించి బండి సంజయ్‌కి అంతర్గత, ఆర్థిక సంబంధాలు, భూలావాదేవీలున్నట్టు ప్రపంచం మొత్తం తెలుసు. ఆ దందాలు కొనసాగేందుకు రెండు పార్టీల నాయకులు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నరు. వారి జేజమ్మలు దిగివచ్చినా అది సాధ్యం కాదు.
– జగదీశ్‌రెడ్డి