కాసిపేట, నవంబర్ 25 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్ గనిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే కొత్త కోడ్లను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పాత 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
కార్మిక హక్కులను హరించే చట్టాలను తీసుకువచ్చిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ చట్టాలకు నిరసనగా 26న నల్ల జెండాలతో జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, ఐఎన్టీయూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బన్న లక్ష్మణ్ దాస్, సీఐటీయూ సెంట్రల్ కమిటీ సెక్రెటరీ అల్లి రాజేందర్, టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బెల్లం అశోక్, అర్ధమల్ల రాజేందర్, సోగాల కన్నయ్య, ఈదునూరి బాపు, బాణోత్ తిరుపతి, శ్రీకాంత్, రాజేశం, అశోక్, రంజిత్, సందీప్, శ్రీధర్,అబ్దుల్ రమేష్, శ్రీనివాస్, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు.