కరీంనగర్ రూరల్, నవంబర్ 5: యాసంగి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా సేకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు నోరు మెదుపటంలేదని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, కరీంనగర్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారటంతో ఈ సారి పుష్కలంగా ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. ధాన్యం సేకరించబోమని ఎఫ్సీఐ చేతులెత్తేయటంతో రాష్ట్రప్రభుత్వమే స్వయంగా కొనాలని నిర్ణయించిందని తెలిపారు. వానకాలం పంటలో ప్రతీగింజను కొంటామని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 6,540 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,762 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. యాసంగి ధాన్యాన్ని అయినా ఎఫ్సీఐ సేకరించేలా బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్చేశారు.