హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు తానే రాజు, తానే మంత్రిని అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. తనకు ఎవరూ పోటీకాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తేల్చిచెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. పదిన్నరేండ్లు వరుసగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టంచేశారు. 2029లో జమిలి ఎన్నికలు వస్తాయని, తన టర్మ్ కంటే ఆరు నెలలు అదనంగా సమయం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత మరో ఐదేండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జాతీయ సొత్తు అని, భారతరత్నకు ఆయన పేరును ప్రతిపాదిస్తామని చెప్పారు. అమీర్‌పేటలో ఎన్టీయార్ విగ్రహం పెడతామని ప్రకటించారు.
నైని బొగ్గు గనుల వివాదానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకే సీఎం ఢిల్లీకి వచ్చారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు. వాస్తవాలన్నీ సభలో పెడతామన్నారు. కేంద్ర గనులశాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. టెండర్ నిబంధనలను సింగరేణి సొంతంగా తయారు రూపొందించలేదని తెలిపారు. 2018లోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసిందని చెప్పారు. తాము ఆ నిబంధనలను అడాప్ట్ చేసుకున్నామని వెల్లడించారు.
సైట్ విజిట్ చేసి, సైట్లో ఉన్న అధికారితో సర్టిఫికెట్ తీసుకోవాలనే నిబంధన అప్పట్లోనే ఉన్నదని, తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టంచేశారు. దీనిని నిరూపిస్తే కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్తారా? అని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చే నాటికే సింగరేణి అప్పుల్లో ఉన్నదని తెలిపారు. తాను అమాయకుడిని కాబట్టే, తన మీద నిందలు వేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఫార్ములా-ఈ కేసులో దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాశామని, ఈడీకి ఆధారాలు అందించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినా వాళ్లను ఈడీ ఎందుకు విచారించడం లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్‌ట్యాపింగ్ విచారణ కొనసాగుతున్నదని, పారదర్శకంగా జరగాలని, త్వరలో చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించానని సీఎం తెలిపారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం లేకపోతే ఫోన్‌ట్యాపింగ్, విద్యుత్తు కమిషన్ కేసులు కూడా సీబీఐకి ఇస్తామని అన్నారు. కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఈ కేసులు కేంద్రానికి అప్పగిస్తామన్నారు.
కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ను ఎవరూ బాంబులతో పేల్చలేదని సీఎం స్పష్టంచేశారు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టు పైకి లేస్తుందిగానీ గుంతలోకి కూరుకుపోదని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై వస్తున్న ఆరోపణలపైనా సీఎం స్పందించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలేవీ ఆ ల్యాబ్‌లో లేవని చెప్పారు. 2021లోనే ఆధారాలను కోర్టుకు అందజేశారన్నారు. ల్యాబ్‌లో కేసులను అప్పటికప్పుడే విశ్లేషించి, నివేదికలు ఇస్తారని తెలిపారు. కూర్చుని మాట్లాడుకుంటే గోదావరి జలాల సమస్య తీరుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి కేంద్రం సహకరిస్తున్నదని, తెలంగాణకు కూడా సహకరిస్తే బాగుంటుందని అన్నారు.