ఇది వ్యవసాయ సంబంధమైన సామెతే అయినా.. ఇంటికి, పొలానికి ముడిపెట్టి చెప్పారు. పంటలకు నీళ్ల వసతి చాలా ముఖ్యం. చెరువు తూముకు దగ్గరలో మడి ఉంటే వ్యవసాయానికి అనుకూలం (మదుంవార మడి అంటే ఇదే). ఎప్పుడంటే అప్పుడు పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు.
ఆ పొలానికి పారిన తర్వాతే మరో పొలానికి నీళ్లు వెళ్లేది. నీటి పారుదల బావుంటే.. సకాలంలో పంట చేతికొస్తుంది. అధిక దిగుబడులు వస్తాయి. ఇక మాటకారి అయినవాడు, నలుగురిలో పలుకుబడి ఉన్నవాడు భర్తగా వస్తే.. ఆ భార్యకు దక్కే గౌరవమే వేరు. అందుకే ‘మదుం వార మడైనా ఉండాలి.. మాటకారి మొగుడైనా ఉండాలి’ అంటారు పెద్దలు. మదుం వారమడి, మాటకారి భర్త వల్ల విస్తృత ప్రయోజనాలు ఉంటాయనే నిగూడార్థంలో చెప్పిన సామెత ఇది.